Harbhajan Singh on SKY: “సూర్యకుమార్ యాదవ్ చేసేది.. కోహ్లీ, రోహిత్ కూడా చేయలేరు”: హర్భజన్ సింగ్
Harbhajan Singh on Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‍పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్ భారత జట్టులో అతడిని తీసుకోవడాన్ని సమర్థించారు. అందుకు కారణాలను వివరించారు.
Harbhajan Singh on Suryakumar Yadav: ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‍కు చోటివ్వడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టీ20ల్లో అతడు అదరగొడుతున్నా.. వన్డే క్రికెట్‍లో సూర్య సరైన ఫామ్‍లో లేడని అంటున్నారు. సూర్య బదులు సంజూ శాంసన్‍ను తీసుకోవాల్సిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శాంసన్‍కు వన్డేల్లో మంచి యావరేజ్ ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించారు. బ్యాటింగ్ ఆర్డర్ ఐదు, ఆరు స్థానాల్లో వచ్చి సూర్యకుమార్ చేసే భయం లేని బ్యాటింగ్‍ను.. ప్రస్తుతం టీమిండియాలో అంతకంటే అత్యుత్తమంగా మరెవరూ చేయలేరని భజ్జీ అభిప్రాయపడ్డారు. ఆ బ్యాటింగ్ స్థానాల్లో వచ్చి సూర్యకుమార్ చేసేది.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చేయలేరని హర్భజన్ అన్నారు.
వన్డే ప్రపంచకప్ భారత జట్టులో శాంసన్‍ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‍ను తీసుకోవడాన్ని హర్భజన్ సింగ్ సమర్థించారు. “సంజూ శాంసన్ పట్ల సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించారని నేను అనుకోవడం లేదు. సంజూ శాంసన్ చాలా మంచి ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్. కానీ 15 మంది ఆటగాళ్లను మాత్రమే మనం ఎంపిక చేయగలం. సంజూ కంటే సూర్యకుమారే ఆడాలి. సూర్యకుమార్ యాదవ్ భారీ రన్స్ చేయగలడు. కానీ సంజూ శాంసన్ హైరిస్క్ విధానంతో ఆడతాడు” అని హర్భజన్ సింగ్.. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో చెప్పారు.
బ్యాటింగ్ ఆర్డర్ 5 లేదా 6వ స్థానంలో సూర్యకుమార్ అద్భుతంగా, దూకుడుగా ఆడతాడని హర్భజన్ సింగ్ చెప్పారు. “నాతో కొందరు ఏకీభవించకపోవచ్చు. వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ఏం చేశాడని అడగొచ్చు. కానీ టీ20ల్లో సూర్యకుమార్ ఏం చేశాడో అందరికీ తెలుసు కదా. వన్డేల్లో 5,6 స్థానాల్లో ఆడాల్సి వస్తే టీ20 పరిస్థితులే ఉంటాయి. ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేసేందుకు అతడి కంటే అత్యుత్తమమైన ప్లేయర్ ప్రస్తుతం టీమిండియాలో లేరు. ఆ బ్యాటింగ్ స్థానాల్లో అతడు ఏం చేయగలడో.. అది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చేయలేరు” అని హర్భజన్ సింగ్ చెప్పారు.
గతంలో టీమిండియాకు ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఏం చేశారో సూర్యకుమార్ అది చేయగలడని భజ్జీ చెప్పారు. 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కష్టమని.. అయితే ఆ బాధ్యతను సూర్యకుమార్ అలవోకగా చేస్తాడని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒత్తిడిలో ఉన్నా సూర్య అద్భుతంగా రాణిస్తారని, ఏ రోజైనా మ్యాచ్ విన్నర్ అవుతాడని చెప్పారు.