తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Retention Players: భారత స్టార్ క్రికెటర్‌ని వేలానికి వదిలేస్తున్న ముంబయి ఇండియన్స్, నలుగురిని మాత్రమే రిటెన్!

MI Retention Players: భారత స్టార్ క్రికెటర్‌ని వేలానికి వదిలేస్తున్న ముంబయి ఇండియన్స్, నలుగురిని మాత్రమే రిటెన్!

Galeti Rajendra HT Telugu

18 October 2024, 10:51 IST

google News
  • MI Retention Players List for IPL 2025: ముంబయి ఇండియన్స్ టీమ్‌లో స్టార్ ప్లేయర్లకి కొదవ లేదు. కానీ ఐపీఎల్ 2024లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఈసారి ఫ్రాంఛైజీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. 

ముంబయి ఇండియన్స్
ముంబయి ఇండియన్స్ (AP)

ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ భారత స్టార్ క్రికెటర్‌కి షాక్ ఇవ్వబోతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాని ప్రస్తుతం సిద్ధం చేస్తున్న ముంబయి ఇండియన్స్.. యంగ్ వికెట్ కీపర్/ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ని వేలానికి వదిలేయాని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అక్టోబరు 31 డెడ్ లైన్

అక్టోబరు 31లోగా అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంది. ఐపీఎల్ పాలక మండలి ఆదేశాల ప్రకారం టోర్నీలోని ప్రతి ఫ్రాంఛైజీ వేలానికి ముందు కేవలం ఐదుగురు ఆటగాళ్లని మాత్రమే రిటెన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  

ఐపీఎల్ 2025 వేలం సమయంలో ఒక ప్లేయర్‌ని మాత్రం రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ద్వారా దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ చాలా తెలివిగా నలుగురు ఆటగాళ్లని మాత్రమే రిటెన్ చేసుకుని.. ఇషాన్ కిషన్ కోసం ఆర్‌టీఎం కార్డు వాడాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ జట్టుకి దూరంగా ఇషాన్

ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నలుగురు ప్లేయర్లూ ఇప్పుడు భారత్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈ నలుగురు ఇప్పుడున్న ఫామ్, క్రేజ్ ఆధారంగా వేలానికి వదిలి రిస్క్ చేయకూడదని ముంబయి ఫ్రాంఛైజీ యోచిస్తోంది. మరోవైపు ఇషాన్ ఇప్పుడు భారత్ జట్టుకి దూరంగా ఉంటున్నాడు. అతని రీఎంట్రీపై కూడా క్లారిటీ రావడం లేదు. దాంతో ఇషాన్‌ను లైట్ తీసుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2024లో ముంబయి ఫెయిల్

వాస్తవానికి ముంబయి ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ 2024 సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో గెలిచింది కేవలం 4 మాత్రమే. దాంతో పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడం, గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు ఇవ్వడంతో జట్టు గాడితప్పింది. దాంతో కెప్టెన్సీ మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మళ్లీ రోహిత్ శర్మకి పగ్గాలు ఇవ్వాలని ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ముంబయికి మిగిలేది రూ.59 కోట్లే

ఐపీఎల్ 2025 సీజన్ వేలం కోసం ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లని బీసీసీఐ కేటాయించగా.. రిటెన్ష్ కోసం రూ.75 కోట్ల వరకూ ఫ్రాంఛైజీలు ఖర్చు చేయవచ్చు. దాంతో ఒకవేళ ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాని రిటెన్ చేసుకుంటే.. అప్పుడు వారికి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు, రూ.18 కోట్లు చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. అంటే రూ.61 కోట్లు పోతే.. మిగిలిన రూ.59 కోట్లతో వేలానికి వెళ్తుందన్నమాట.

తదుపరి వ్యాసం