BCCI on Ishan Kishan: రంజీ ట్రోఫీ ఆడలేదో.. ఇషాన్ కిషన్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వనున్న బీసీసీఐ-bcci set to issue strong warning to ishan kishan ranji trophy ipl 2024 telugu cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Bcci On Ishan Kishan: రంజీ ట్రోఫీ ఆడలేదో.. ఇషాన్ కిషన్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వనున్న బీసీసీఐ

BCCI on Ishan Kishan: రంజీ ట్రోఫీ ఆడలేదో.. ఇషాన్ కిషన్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వనున్న బీసీసీఐ

Hari Prasad S HT Telugu
Feb 12, 2024 01:21 PM IST

BCCI on Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పదే పదే చెబుతున్నా రంజీ ట్రోఫీ ఆడకపోవడంపై బోర్డు మండిపడుతోంది.

రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనని ఇషాన్ కిషన్ కు వార్నింగ్ ఇవ్వనున్న బీసీసీఐ
రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనని ఇషాన్ కిషన్ కు వార్నింగ్ ఇవ్వనున్న బీసీసీఐ (AFP)

BCCI on Ishan Kishan: రంజీ ట్రోఫీ ఆడకుండా కొందరు ప్లేయర్స్ అప్పుడే ఐపీఎల్ మోడ్ లోకి వచ్చేస్తుండటంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్ తో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటంపై బోర్డు ఆగ్రహంగా ఉందట. త్వరలోనే గట్టి వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది.

ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ ఆడతాడా లేదా?

గతేడాది నవంబర్ నుంచి టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరంగా ఉన్నాడు. అతడు మళ్లీ జట్టులోకి రావాలంటే ఏదో ఒక క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ అతనికి మంచి అవకాశం. కానీ ఇషాన్ మాత్రం దానిని కాదనుకొని బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్ తో రిలయెన్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

తన టీమ్ జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. ఇషాన్ కిషన్ నో చెప్పాడు. దీంతో బీసీసీఐ అతనిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీకి ప్లేయర్స్ అందుబాటులో ఉండకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుని ఆశిస్తున్నట్లు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అన్నాడు.

ఇషాన్‌కు వార్నింగ్ తప్పదా?

తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఫిట్ గా ఉన్న ప్లేయర్స్ అందరూ రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని బీసీసీఐ ఓ నోటీస్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఇషాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కొందరు ప్లేయర్స్ ఇప్పటికే ఐపీఎల్ మోడ్ లోకి వెళ్లడంపై కూడా బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది.

"ప్లేయర్స్ అందరూ వాళ్ల వాళ్ల రాష్ట్ర జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడాల్సిందిగా రానున్న కొద్ది రోజుల్లో బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లనుంది. నేషనల్ టీమ్ లో ఉన్న వాళ్లు, గాయపడిన ప్లేయర్స్ కు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కొందరు ప్లేయర్స్ జనవరి నెల నుంచే ఐపీఎల్ మోడ్ లోకి వెళ్లడం బీసీసీఐకి నచ్చడం లేదు" అని బోర్డు వర్గాలు వెల్లడించిటన్లు ఆ రిపోర్టు తెలిపింది.

మానసికంగా అలసిపోయానంటూ గతేడాది నవంబర్ నుంచి ఇషాన్ కిషన్ అందుబాటులో లేడు. మూడు నెలలవుతున్నా.. ఇప్పటికీ అతడు ఎలాంటి క్రికెట్ ఆడటం లేదు. ఓవైపు రాహుల్ ద్రవిడ్ హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు వరల్డ్ కప్ లో గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా మాత్రం దాని నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

బీసీసీఐ సీరియస్ గా ఉందన్న వార్తల నేపథ్యంలో అయినా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ రంజీ ట్రోఫీలో ఆడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇప్పటికీ అతడు స్పందించకపోతే ఇప్పట్లో జాతీయ జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఇషాన్ ఈ రిస్క్ తీసుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Whats_app_banner