Mohammed Shami Arjuna Award: అర్జున అవార్డు అందుకున్న మహ్మద్ షమి
09 January 2024, 12:01 IST
- Mohammed Shami Arjuna Award: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి మంగళవారం (జనవరి 9) అర్జున అవార్డు అందుకున్నాడు. గత వరల్డ్ కప్ లో రాణించిన షమి పేరును ఈ అవార్డు కోసం బీసీసీఐ రికమండ్ చేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అర్జున అవార్డు అందుకుంటున్న మహ్మద్ షమి
Mohammed Shami Arjuna Award: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి స్పోర్ట్స్ లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్నాడు. మంగళవారం (జనవరి 9) రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు ఈ అవార్డు అందుకోవడం విశేషం. ఈ అవార్డు కోసం అతని పేరును బీసీసీఐ సిఫార్సు చేసింది.
గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మహ్మద్ షమి నిలిచిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఇండియన్ టీమ్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న షమి.. వరల్డ్ కప్ లో 7 మ్యాచ్ లలోనే 24 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. మొదట్లో నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్న అతడు.. ఐదో మ్యాచ్ లో అవకాశం దక్కించుకొని చెలరేగిపోయాడు.
చాలా సంతోషంగా ఉంది: షమి
దీంతో షమి పేరును అర్జున అవార్డు కోసం బీసీసీఐ సిఫార్సు చేసింది. ఈ అవార్డు అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ముందు షమి చెప్పాడు. "ఈ అవార్డు ఓ కల. చాలా మంది తమ జీవితంలో ఈ అవార్డు గెలవలేరు. ఈ అవార్డు కోసం నన్ను నామినేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది" అని షమి అన్నాడు.
హార్దిక్ పాండ్యా గాయపడటం గత వరల్డ్ కప్ లో షమికి కలిసి వచ్చింది. పాండ్యా దూరమైన తర్వాతగానీ షమికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక తర్వాత అన్ని మ్యాచ్ లలోనూ జట్టులో ఉన్నాడు. రెండో మ్యాచ్ లో 4 వికెట్లు, మూడో మ్యాచ్ లో మరోసారి 5 వికెట్లు తీశాడు.
ఇక న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో అయితే ఏకంగా 7 వికెట్లు తీయడం విశేషం. ఓ వరల్డ్ కప్ మ్యాచ్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇదే కావడం విశేషం. అంతేకాదు వన్డే వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా కూడా షమి నిలిచాడు. 2023లో ఇండియన్ టీమ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన షమిని అర్జున అవార్డు వరించింది.
23 మందికి అర్జున అవార్డు
2023లో ఇండియాకు వివిధ క్రీడల్లో కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన మొత్తం 26 మంది అథ్లెట్లు ఈసారి అర్జున అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా గతేడాది ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ గెలిచిన వాళ్లే ఈ జాబితాలో ఎక్కువ మంది ఉన్నారు. చైనాలో జరిగిన ఈ గేమ్స్ లో 107 మెడల్స్ తో ఇండియన్ అథ్లెట్లు సత్తా చాటారు. ఇంతకుముందు 70 మెడల్స్ తో ఉన్న అత్యుత్తమ ప్రదర్శనను ఎంతో మెరుగుపరిచారు.
షమి కాకుండా.. ఆర్చరీ నుంచి అదితి గోపీచంద్, ఓజస్ ప్రవీణ్, అథ్లెటిక్స్ నుంచి పారుల్ చౌదరీ, శ్రీశంకర్, కబడ్డీ నుంచి పవన్ కుమార్, రీతూ నేగి, హాకీ నుంచి పుఖ్రంబం సుశీల, కృష్ణన్ బహదూర్ పాఠక్, షూటింగ్ నుంచి ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమార్, రెజ్లింగ్ నుంచి అంతిమ్, సునీల్ కుమార్.. బ్లైండ్ క్రికెట్ నుంచి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిలకు ఈ అర్జున అవార్డులు దక్కాయి.