Hardik Pandya: జిమ్‍లో తీవ్రంగా చెమటోడ్చిన హార్దిక్ పాండ్యా: వీడియో షేర్ చేసిన స్టార్ ఆల్‍రౌండర్-hardik pandya sweats out in an intense gym session and shares the video ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya: జిమ్‍లో తీవ్రంగా చెమటోడ్చిన హార్దిక్ పాండ్యా: వీడియో షేర్ చేసిన స్టార్ ఆల్‍రౌండర్

Hardik Pandya: జిమ్‍లో తీవ్రంగా చెమటోడ్చిన హార్దిక్ పాండ్యా: వీడియో షేర్ చేసిన స్టార్ ఆల్‍రౌండర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2024 09:43 PM IST

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జిమ్‍లో తీవ్రంగా కసరత్తులు చేశాడు. ఆ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి హార్దిక్ కోలుకుంటున్నాడు.

జిమ్‍లో హార్దిక్ పాండ్యా
జిమ్‍లో హార్దిక్ పాండ్యా

Hardik Pandya: గాయం కారణంగా గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ మధ్యలోనే భారత స్టార్ ఆల్‍రౌండర్ హార్దిక్ పాండ్యా నిష్క్రమించాడు. వరల్డ్ కప్‍లో బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో బంతిని ఆపే క్రమంలో పాండ్యా చీలమండకు గాయమైంది. దీంతో అప్పటి నుంచి అతడు భారత జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు మిస్ కాగా.. టీమిండియా తదుపరి అఫ్గానిస్థాన్‍తో ఆడనున్న టీ20 సిరీస్‍లోనూ లేడు. ప్రస్తుతం గాయం నుంచి పాండ్యా కోలుకుంటున్నాడు. కాగా, తాజాగా జిమ్‍లో చెమటోడ్చాడు హార్దిక్ పాండ్యా. తీవ్రంగా వ్యాయామాలు చేశారు. ఈ వీడియోను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పాండ్యా పోస్ట్ చేశాడు.

గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కల్లా పూర్తిస్థాయి ఫిట్‍నెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంగ్లండ్‍తో టీమిండియా ఆడే ఐదు టెస్టుల సిరీస్‍కు కూడా అతడు ఎంపిక కావడం కష్టమే. దీంతో మార్చి ఆఖర్లో మొదలయ్యే 2024 ఐపీఎల్‍పైనే ప్రస్తుతం ఫుల్ ఫోకస్ పెట్టాడు హార్దిక్. ఈ తరుణంలో తాను వర్కౌట్ చేసిన వీడియోను నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు పాండ్యా. “వెళ్లేందుకు ఒకే దిశ ఉంది.. ముందుకే” అని ఈ వీడియోకు పాండ్యా క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ టీమ్ తిరిగి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చుకుంది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకొని హార్దిక్‍ను మళ్లీ తీసుకుంది. హార్దిక్‍ను కెప్టెన్‍గా ప్రకటించింది. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‍ను కెప్టెన్‍గా చేసింది ముంబై.

2015లో ముంబై ఇండియన్స్ జట్టుతోనే ఐపీఎల్‍లో అడుగుపెట్టాడు హార్దిక్ పాండ్యా. 2021 వరకు ముంబైలోనే ఆడాడు. అయితే, 2022 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ టీమ్‍కు వెళ్లాడు. 2022 సీజన్‍లో పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 2023 సీజన్‍లో ఫైనల్‍కు చేరి రన్నరప్‍గా నిలిచింది. అయితే, 2024 సీజన్ కోసం గుజరాత్‍ నుంచి మళ్లీ ట్రేడ్ చేసుకొని హార్దిక్ తిరిగి తీసుకొచ్చుకుంది ముంబై ఇండియన్స్. ఈ ఏడాది సీజన్‍లో ముంబైకి హార్దిక్ కెప్టెన్సీ చేయనున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్‍లో టీమిండియాకు పాండ్యా కీలకంగా ఉండనున్నాడు.

టీ20ల్లో రోహిత్ పునరాగమనం

భారత టీ20 జట్టులోకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత వన్డేలు, టెస్టులకు ఆ ఇద్దరు పరిమితమయ్యారు. అయితే, అఫ్గానిస్థాన్‍తో జనవరి 11వ తేదీ నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్‍కు రోహిత్, కోహ్లీ ఎంపికయ్యారు. దీంతో 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులోకి వారిద్దరూ వచ్చినట్టయింది.

రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. దీంతో టీ20లకు అతడే సారథిగా కొనసాగొచ్చనే అంచనాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లోనూ హార్దిక్ కెప్టెన్‍గా ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, రోహిత్ శర్మ టీ20ల్లోకి వచ్చేయటంతో ప్రపంచకప్‍లో పాండ్యా కెప్టెన్సీ చేసే అవకాశాలు సన్నగిల్లాయి. టీ20 ప్రపంచకప్‍కు భారత జట్టు ఎంపిక.. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఉండే అవకాశం ఉంది.

Whats_app_banner