Hardik Pandya: హార్దిక్ పాండ్యా విషయంలో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన పాత టీమ్ ముంబై ఇండియన్స్‌కు పాండ్యా తిరిగి వెళ్లాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన పాండ్యా.. మళ్లీ ముంబై గూటికి చేరాడు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ కూడా విజయవంతంగా జరిగింది. ఈ విషయంపై ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేశాయి.
హార్దిక్ పాండ్యాకు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ వీడ్కోలు చెప్పింది. “ప్రియమైన హార్దిక్ పాండ్యా.. నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలకు ధన్యవాదాలు. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం” అని గుజరాత్ టైటాన్స్ ట్వీట్ చేసింది. 2022 సీజన్ కోసం ముంబైని వీడి గుజరాత్ జట్టుకు వెళ్లాడు హార్దిక్. 2022 సీజన్‍లో హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది 2023 సీజన్‍లో ఫైనల్‍కు చేరింది. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ బరిలోకి దిగనున్నాడు.
హార్దిక్ మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేశాడంటూ ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి హార్దిక్ మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉందని ఆ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా కోసం రూ.15కోట్లతో పాటు ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద మరికొంత మొత్తాన్ని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ముంబై ఇండియన్స్ చెల్లించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ట్రేడెడ్ ఆటగాడిగా రికార్డుల్లో హార్దిక్ పాండ్యా నిలిచాడు. 2015 నుంచి 2021 వరకు ఐపీఎల్‍లో ముంబై తరఫునే ఆడాడు పాండ్యా. ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరాడు.
ఇక, ఆస్ట్రేలియా ఆల్‍రౌండర్ కెమరూన్ గ్రీన్‍ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ట్రేడ్ చేసింది ముంబై ఇండియన్స్. పాండ్యా ట్రేడ్ తర్వాత డిసెంబర్ 19న జరిగే వేలం కోసం పర్సును పెంచుకునేందుకు గ్రీన్‍ను ఆర్సీబీకి ఇచ్చేసింది. హార్దిక్, గ్రీన్ ట్రేడ్ తర్వాత ముంబై ఇండియన్స్ పర్సులో ఇప్పుడు రూ.17.75 కోట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2024 కోసం మినీ ఐపీఎల్ వేలం ఈ ఏడాది డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.
ఐపీఎల్ 2024 సీజన్లో తమ జట్టు కొత్త కెప్టెన్‍గా యువ స్టార్ శుభ్‍మన్ గిల్‍ను గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది.
హార్దిక్ పాండ్యాను ఆదివారం (నవంబర్ 26) గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుంది. జట్టులో కొనసాగిస్తున్నట్టు ప్రకటించడంతో సస్పెన్స్ నెలకొంది. అయితే, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ట్రేడ్ జరిగింది. హార్దిక్‍ను ముంబై ట్రేడ్ ద్వారా తిరిగి పొందింది.
సంబంధిత కథనం