IND vs AFG: టీ20ల్లోకి రోహిత్ శర్మ, కోహ్లీ రీఎంట్రీ.. అఫ్గాన్‍తో సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. ఇద్దరు పేసర్లకు రెస్ట్-rohit sharma virat kohli returns in indian t20 team bcci announces squad for afghanistan series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Afg: టీ20ల్లోకి రోహిత్ శర్మ, కోహ్లీ రీఎంట్రీ.. అఫ్గాన్‍తో సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. ఇద్దరు పేసర్లకు రెస్ట్

IND vs AFG: టీ20ల్లోకి రోహిత్ శర్మ, కోహ్లీ రీఎంట్రీ.. అఫ్గాన్‍తో సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. ఇద్దరు పేసర్లకు రెస్ట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 07, 2024 08:01 PM IST

IND vs AFG T20 - Rohit Sharma, Virat Kohli: అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్‍తో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ20 జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. వివరాలివే..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (AFP)

IND vs AFG T20 - Rohit Sharma, Virat Kohli: స్వదేశంలో అఫ్గానిస్థాన్‍తో జరిగే మూడు టీ20ల సిరీస్‍కు భారత జట్టును బీసీసీఐ నేడు (జనవరి 7) ప్రకటించింది. భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‍తో మళ్లీ భారత టీ20 జట్టులో పునరాగమనం చేశారు. చివరగా భారత్ తరఫున 2022 ప్రపంచకప్‍లో టీ20 ఆడారు ఆ ఇద్దరు. ఆ తర్వాత వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు 14 నెలల తర్వాత మళ్లీ భారత టీ20 టీమ్‍లోకి రోహిత్, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సిరీస్‍కు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ ఏడాది జూన్‍‍లో జరిగే టీ20 ప్రపంచకప్‍నకు ముందు భారత్ ఆడనున్న ఆఖరి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఇదే కానుండటంతో కీలకంగా మారింది. ఈ సిరీస్‍కు రోహిత్, కోహ్లీ వచ్చేయడంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍ కోసం కూడా వారిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సెలెక్టర్లు సంకేతాలు ఇచ్చేశారు.

అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు భారత్ స్టార్ పేసర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‍కు టీమిండియా సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక, భారత టీ20 టీమ్‍లోకి వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా మళ్లీ వచ్చాడు.

కిషన్‍కు నో ప్లేస్

ఈ సిరీస్‍కు ఓపెనర్లు శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్ చోటు నిలబెట్టుకున్నారు. అయితే, వికెట్ కీపింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‍ను సెలెక్టెర్లు పక్కన పెట్టారు. దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీతో అదగొట్టిన సంజూ శాంసన్‍ను అఫ్గాన్‍తో టీ20 సిరీస్‍కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. యంగ్ వికెట్ కీపర్‌ జితేశ్ శర్మ కూడా కొనసాగాడు.

కుల్‍దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్.. ఈ సిరీస్‍లో స్పిన్నర్లుగా ఉన్నారు. స్టార్ ఆల్ రౌండర్ జడేజాకు కూడా సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ పేసర్లుగా ఉన్నారు. ఇటీవల పేలవ ప్రదర్శన చేసిన ముకేశ్ కుమార్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. స్టార్ పేసర్లు బుమ్రా, సిరాజ్‍కు రెస్ట్ ఇచ్చారు. గాయాల నుంచి ఇంకా కోలుకోని హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అఫ్గానిస్థాన్‍తో ఈ సిరీస్‍కు దూరమయ్యారు.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జనవరి 11వ తేదీన తొలి టీ20, జనవరి 14న రెండో మ్యాచ్, జనవరి 17న మూడో టీ20 జరగనున్నాయి.

అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‍దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

టీమిండియా ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుంది. ఈ టూర్‌లో టీ20 సిరీస్‍ను భారత్ సమం చేసుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‍ను దక్కించుకొని దుమ్మురేపింది. అనంతరం టెస్టు సిరీస్‍ను 1-1తో సమం చేసుకుంది.

Whats_app_banner