Vinesh Phogat: ఖేల్‌రత్న, అర్జున అవార్డులు తిరిగిచ్చేయనున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్-vinesh phogat to give up khel ratna and arjuna awards ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Vinesh Phogat: ఖేల్‌రత్న, అర్జున అవార్డులు తిరిగిచ్చేయనున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్

Vinesh Phogat: ఖేల్‌రత్న, అర్జున అవార్డులు తిరిగిచ్చేయనున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్

Hari Prasad S HT Telugu
Dec 26, 2023 07:58 PM IST

Vinesh Phogat: ఖేల్‌రత్న, అర్జున అవార్డులు తిరిగిచ్చేయాలని నిర్ణయించింది స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రెజ్లర్లలో వినేష్ కూడా ఒకరు.

రెజ్లర్ వినేష్ ఫోగాట్
రెజ్లర్ వినేష్ ఫోగాట్ (Hindustan Times)

Vinesh Phogat: మరో టాప్ రెజ్లర్ తన నేషనల్ అవార్డులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. గత వారం సాక్షి మాలిక్ రెజ్లింగ్ వదిలేయగా.. తర్వాత భజరంగ్ పూనియా తన పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వినేష్ ఫోగాట్ కూడా తనకు వచ్చిన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసింది. ఆ లేఖను వినేష్ ఫోగాట్ మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన ఎన్నికల్లో మాజీ చీఫ్, ఈ వివాదం అంతటికీ కారణమైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలిచిన విషయం తెలిసిందే.

అయితే తర్వాత క్రీడాశాఖ మంత్రి సంజయ్ సింగ్ ఎన్నికను రద్దు చేసింది. ఆయన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు రెజ్లర్లు ఇలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గత వారం ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ వదిలేయగా.. తన పద్మశ్రీ అవార్డును ప్రధాని మోదీ ఇంటి ముందు పెట్టి నిరసన తెలిపాడు భజరంగ్ పూనియా.

ఇక ఇప్పుడు వినేష్ ఫోగాట్ క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించడం గమనార్హం. "నేను నా ఖేల్ రత్న, అవార్డులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అనే క్యాప్షన్ తో ప్రధానికి రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఏడాదిగా తాము నిరసన తెలుపుతున్నా.. ఎవరూ వినిపించుకున్న పాపాన పోలేదని ఆ లేఖలో వినేష్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2016లో సాక్షి మాలిక్ ఒలింపిక్ మెడల్ గెలిచినప్పుడు ఆమెను భేటీ బచావ్ భేటీ పడావ్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ చేశారని.. ఇప్పుడదే సాక్షి మాలిక్ అర్ధంతరంగా రిటైర్మెంట్ ప్రకటించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

మహిళా అథ్లెట్ల పట్ల బ్రిజ్ భూషణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడాలని, వాటిని చూస్తే ఆయన ఎలాంటి వారో మీకే తెలుస్తుందని చెప్పింది. ఓ మహిళకు దక్కాల్సిన గౌరవం దక్కనప్పుడు ఖేల్ రత్న, అర్జునలాంటి అవార్డులకు అర్థం ఏముందని, అందుకే వాటిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

WhatsApp channel

టాపిక్