WFI: కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. క్రీడా శాఖ సంచలన నిర్ణయం-newly elected sanjay singh wrestling federation of india body suspended by sports ministry ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wfi: కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. క్రీడా శాఖ సంచలన నిర్ణయం

WFI: కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. క్రీడా శాఖ సంచలన నిర్ణయం

Sanjiv Kumar HT Telugu

Wrestling Federation Of India: సంజయ్ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. క్రీడా శాఖ సంచలన నిర్ణయం

Wrestling Federation Of India Suspended: భారత క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా కొత్తగా ఎన్నైకైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని సస్పెండ్ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటనతో ఇలా వేటు వేసినట్లు సమచారం.

ప్రధాన అనుచరుడిగా

అయితే, ఇటీవలే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు జరగ్గా.. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ తన బలాన్ని నిరూపించుకున్నాడు. నేరుగా బరిలోకి దిగని బ్రిజ్ భూషణ్ 15 పదువుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. దీంతో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు.

పద్మ శ్రీ వెనక్కి

2010 కామన్వెల్త్ క్రీడల బంగారు పతక విజేత అనిత షెరాన్‌పై 40-7 ఓట్ల తేడాతో విజయం సాధించి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టాడు సంజయ్ సింగ్. ఇదిలా ఉంటే డబ్ల్యూఎఫ్ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నిక కావడంపై మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ నిరసన వ్యక్తం చేసింది. ఆటకు గుడ్ బై చెబుతూ నిరసన తెలిపింది. అలాగే తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చాడు బజరంగ్ పునియా. మరోవైపు సాక్షికి సపోర్ట్‌గా బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా పద్మ శ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించాడు.

సమాచారం ఇవ్వకుండా

ఈ నేపథ్యంలో అండర్ 16, అండర్ 20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్న నంది నగర్‌లో జరుగుతాయని డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ సింగ్ ప్రకటించాడు. క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్ఐ‌కు విరుద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది.

ఆర్టికల్ 11 ప్రకారం

ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని క్లాజ్ 3 (e) ప్రకారం సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం మీటింగ్‌కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. దీనికి కనీసం 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది.

నిబంధనల అతిక్రమణ

మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి. అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం 7 రోజుల సమయం ముందు నోటీస్ ఇవ్వాలి. ఈ నిబంధనలను సంజయ్ సింగ్ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.

టాపిక్