Kl Rahul: కేఎల్ రాహుల్‌పై లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ ఫైర్ - కెప్టెన్సీ పదవికి ఎసరుపడనుందా?
09 May 2024, 9:55 IST
Kl Rahul: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ దారుణ పరాజయంపై ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గొయేంకా ఫైర్ అయ్యారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు క్లాస్ పీకాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
కేఎల్ రాహుల్
Kl Rahul: బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో విధించిన 166 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. లక్నో బౌలర్లను సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చీల్చి చెండాడారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.
సంజీవ్ గొయేంకా ఫైర్...
హెడ్, అభిషేక్ శర్మలను కట్టడి చేయడంలో లక్నో ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ దారుణ పరాజయంతో కేఎల్ రాహుల్‌పై లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గొయేంకా కూడా ఫైర్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ కెప్టెన్సీపై అందరి ముందే సంజీవ్ గొయేంకా అగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో రాహుల్ చేసిన తప్పుల గురించి చాలా సీరియస్‌గా మాట్లాడాడు. సంజీవ్‌కు సర్ధిచెప్పేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. రాహుల్ మాటలను సంజీవ్ పెద్దగా పట్టించుకోనట్లుగా వీడియో చూస్తుంటే తెలుస్తోంది.
వీడియోలు వైరల్...
కేఎల్ రాహుల్‌కు సంజీవ్ గొయేంకా క్లాస్ ఇస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రాహుల్ కెప్టెన్సీపై చాలా రోజులుగా సంజీవ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ చేతిలో దారుణ పరాభవంతో కేఎల్ రాహుల్ స్థానంలో మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు లక్నో ఓనర్ సూచించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లలో లక్నోకు రాహుల్ స్థానంలో నికోలస్ పూరన్ లేదా కృనాల్ పాండ్య ఒకరు కెప్టెన్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో ట్రోల్స్...
లక్నో ఫ్యాన్స్ కూడా కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్స్ చేస్తున్నారు. అతడిని టీమ్ నుంచి పక్కనపెట్టాలంటూ ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ సీజన్‌లో కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోవద్దంటూ సంజీవ్ గొయేంకాను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతోన్నారు. ఈ పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి.
ఆరో స్థానం...
ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 12 మ్యాచుల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో లక్నో ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో లక్నో తప్పకుండా గెలిచి తీరాల్సివుంది. ఆరంభంలో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాఫ్ ఫోర్‌లోకి వచ్చిన లక్నో ఆ తర్వాత ఓటములతో డీలా పడింది ఈ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విఫలమైన బ్యాట్స్‌మెన్స్‌గా రాహుల్ రాణించాడు. 12 మ్యాచుల్లో 460 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.