తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Retentions: ఐపీఎల్ 2025 కోసం టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా ఇదే!

IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 కోసం టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా ఇదే!

Galeti Rajendra HT Telugu

31 October 2024, 7:49 IST

google News
  • IPL 2025 retained players List: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబరు ద్వితీయార్థంలో జరగనుండగా.. ఈరోజు సాయంత్రం లోపు ఏ ఏ ప్లేయర్లని తాము అట్టిపెట్టుకుంటున్నామో టోర్నీలోని ఫ్రాంఛైజీలు అన్నీ ధరలతో సహా లిస్ట్ ఇవ్వాల్సి ఉంది. 

ఐపీఎల్ 2025 రిటెన్షన్‌
ఐపీఎల్ 2025 రిటెన్షన్‌

ఐపీఎల్ 2025 రిటెన్షన్‌

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టోర్నీలోని అన్ని 10 ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని గురువారం (అక్టోబరు 31) సాయంత్రం 5 గంటలలోపు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమర్పించాలి. ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. ప్రతి ఫ్రాంఛైజీ గరిష్టంగా 5 మంది ఆటగాళ్లని రిటెన్ చేసుకోవచ్చు. అలానే ఇప్పటి వరకు టీమ్‌లో ఉన్న ఒక ప్లేయర్‌ని రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు ద్వారా వేలం సమయంలో మాకే కావాలంటూ అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లని బీసీసీఐ కేటాయించగా.. ఇందులో రూ.75 కోట్లని రిటెన్షన్ కోసం ఖర్చు చేసుకునే వెసులబాటుని కల్పించింది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐదుగురు ఆటగాళ్లని రిటెన్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ ధోనీతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానాలను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఐదుగురి కోసం కనీసం రూ.65 కోట్లు చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తుండటంతో అతనికి కేవలం రూ.4 కోట్లే చెన్నై ఇవ్వనుంది.

గుజరాత్ టైటాన్స్ (GT)

గుజరాత్ టైటాన్స్ టీమ్ సీనియర్ ప్లేయర్లని వదిలేసి.. యంగ్ ప్లేయర్లనే అట్టిపెట్టుకోబోతోంది. యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియాతో పాటు పవర్ హిట్టర్ షారుఖ్ ఖాన్‌లను రిటెన్ చేసుకోనుందని తెలుస్తోంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)

ఐపీఎల్ 2024లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈసారి పవర్ హిట్టర్లకి షాక్ ఇవ్వబోతంది. సునీల్ నరైన్, రింకు సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను రిటైన్ చేసుకుని.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, విధ్వంసక హిట్టర్ ఆండ్రీ రసెల్‌ని సైతం వేలంలోకి వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

లక్నో సూపర్ జెయింట్స్‌ది ఒక భిన్నమైన కథ. ఆ జట్టుకి ఏదీ కలిసి రావడం లేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో విభేదాల కారణంగా అతడ్ని వేలంలోకి వదిలేసి.. నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, ఆయుష్ బధోనిలను రిటెన్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ (RR)

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఈసారి కొత్త వ్యూహంతో వేలానికి రాబోతోంది. కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మలను రిటెన్ చేసుకుని.. ఐపీఎల్ 2024లో 18 వికెట్లు పడగొట్టిన సీనియర్ స్పిన్నర్ చాహల్‌, విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్‌ని వేలంలోకి వదలబోతోంది. ఆ తర్వాత వేలంలో వారిని దక్కించుకోవడానికి ఆర్టీఎం కార్డుని వాడాలని భావిస్తున్నట్లు సమాచారం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. టీమ్‌లోని సీనియర్ ప్లేయర్లని వేలంలోకి వదిలి రిస్క్ చేయకూడదని భావిస్తోంది. దాంతో భారీ ధర అయినప్పటికీ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిలతో పాటు దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవాలని భావిస్తోంది. అలానే వేలంలో ఆర్టీఎం కార్డుని అందుబాటులో ఉంచుకోనుంది.

ముంబయి ఇండియన్స్ (MI)

ముంబయి ఇండియన్స్ జట్టులో సమస్యలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో రోహిత్ శర్మ వర్గం గుర్రుగా ఉంది. అయినప్పటికీ.. సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన వార్తల ప్రకారం.. ముంబయి ఫ్రాంఛైజీ జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అట్టిపెట్టుకోనుంది. కానీ.. రోహిత్ శర్మ మాత్రం హార్దిక్ టీమ్‌లో ఉంటే ముంబయి జట్టుతో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని కూడా వార్తలు వచ్చాయి. దాంతో ఒకవేళ రోహిత్ వేలంలోకి వెళ్లినా ఆశ్చర్యపోలేం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ యశ్ దయాళ్‌ను రిటైన్ చేసుకోనుంది. కోహ్లీ చేతికి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం ఉంటే.. డుప్లెసిస్‌ను వేలంలోకి వదిలేయవచ్చు. అలానే గ్లెన్ మాక్స్‌వెల్‌ను కూడా వేలంలోకి వదిలేయబోతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రిషబ్ పంత్ టీమ్‌లో ఉండాలని ఆశిస్తోంది. కానీ అతను మాత్రం తాను వేలంలోకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో రిషబ్ పంత్ ఒకవేళ ఇష్టపడితే అతనితో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను రిటేన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్టీఎం కార్డు ద్వారా మరో ఇద్దరిని వేలంలో అట్టిపెట్టుకునే సౌలభ్యాన్ని చేతుల్లో ఉంచుకోనుంది.

పంజాబ్ కింగ్స్(PBKS)

పంజాబ్ కింగ్స్ పరిస్థితి చాలా వరస్ట్‌గా ఉంది. ఆ జట్టు కనీసం ఎవరిని అట్టిపెట్టుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితి. లివింగ్‌స్టన్, కగిసో రబాడ, సామ్‌ కరన్‌ లాంటి స్టార్లు అందుబాటులో ఉన్నా వారి ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతానికి కేవలం అర్షదీప్ సింగ్‌ పేరుని మాత్రమే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ స్టార్ ప్లేయర్లు ఎవరూ టీమ్‌లో లేకపోవడం ఆ జట్టుకి అతి పెద్ద మైనస్.

తదుపరి వ్యాసం