LSG vs KKR: లక్నోను చిత్తుగా ఓడించిన కోల్‌కతా - మరో ఇరవై ఆరు బాల్స్ మిగిలుండగానే ఓడిన కేఎల్ రాహుల్ టీమ్
14 April 2024, 19:50 IST
LSG vs KKR: ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో కోల్‌కతానైట్ రైడర్స్ చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్, బౌలింగ్‌లోస్టార్క్ రాణించి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు.
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతానైట్ రైడర్స్
LSG vs KKR: ఐపీఎల్ 2024లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో విధించిన సింపుల్ టార్గెట్‌ను మరో ఇరవై ఆరు బాల్స్ మిగిలుండగానే కోల్‌కతా నైట్ రైడర్స్ ఛేదించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో 162 పరుగులు చేసింది.
ఫిలిప్ సాల్ట్ దంచికొట్టుడు...
161 పరుగుల ఈజీ టార్గెట్‌ను కోల్‌కతా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ లక్నో బౌలర్లను ఫోర్ల, సిక్సర్లతో బెంబేలెత్తించాడు. ఫిలిప్ సాల్ట్ 47 బాల్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ (ఆరు రన్స్) , రఘువన్షీ (7 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔట్ అయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బాల్స్‌లో ఆరు ఫోర్లతో 38 పరుగులు) సహకారంతో ఫిలిప్ సాల్ట్ కోల్‌కతాకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. శ్రేయస్ అయ్యర్ నెమ్మదిగా ఆడగా సాల్ట్ మాత్రం ఎడాపెడా ఫోర్లు బాదాడు.
తొలి ఓవర్‌లోనే ఇరవై రన్స్...
సాల్ట్ దెబ్బకు విండీస్ బౌలింగ్ సంచలనం షమర్ జోసెఫ్ తొలి ఓవర్‌లోనే 22 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో రెండు నో బాల్స్, రెండో వైడ్స్‌తో కలిసి పది బాల్స్ వేశాడు. ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడిని సాల్ట్ దంచి కొట్టాడు. నాలుగు ఓవర్లు వేసిన షమర్ జోసెఫ్ ఒక్క వికెట్ తీయకుండానే 47 పరుగులు ఇచ్చాడు. మోషిన్ ఖాన్ మినహా లక్నో బౌలర్లు అందరూ తేలిపోయారు. కోల్‌కతా కోల్పోయిన రెండు వికెట్లు మోషిన్ ఖాన్ తీసినవే కావడం గమనార్హం.
రాహుల్… పూరన్ మినహా...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మెన్ విఫలం కావడం 161 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా...కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా మిగిలిన వారందరూ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
స్టార్క్ మూడు వికెట్లు...
కేఎల్ రాహుల్ 27 బాల్స్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 39 పరుగులు చేసి ఔటవ్వగా...ఆయుష్ బదోని 27 బాల్స్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 29 రన్స్ చేశాడు. వీరిద్దరు ఔటైన తర్వాత నికోలస్ పూరన్ బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రమైనా స్కోరు చేసింది. పూరన్ 32 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 రన్స్ చేశాడు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా...వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ లకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో కోల్‌కతా సెకండ్ ప్లేస్‌కు చేరుకుంది. లక్నో ఐదో స్థానంలో ఉంది