LSG vs KKR: కోట్లు పెట్టి కొంటే కొంప ముంచుతున్నారు - కోల్‌క‌తా ముందు ల‌క్నో ఈజీ టార్గెట్‌-kkr vs lsg ipl 2024 nicholas pooran shines as lsg set 162 runs target against kkr ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lsg Vs Kkr: కోట్లు పెట్టి కొంటే కొంప ముంచుతున్నారు - కోల్‌క‌తా ముందు ల‌క్నో ఈజీ టార్గెట్‌

LSG vs KKR: కోట్లు పెట్టి కొంటే కొంప ముంచుతున్నారు - కోల్‌క‌తా ముందు ల‌క్నో ఈజీ టార్గెట్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2024 05:43 PM IST

LSG vs KKR: కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు ల‌క్నో 162 ప‌రుగులు ఈజీ టార్గెట్‌ను విధించింది. నికోల‌స్ పూర‌న్ (45 ర‌న్స్‌) మిన‌హా ల‌క్నో మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

నికోల‌స్ పూర‌న్
నికోల‌స్ పూర‌న్

LSG vs KKR: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం జ‌రుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఈజీ టార్గెట్‌ను విధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 161 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. నికోల‌స్ పూర‌న్ 45 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా... కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 ప‌రుగుల‌తో రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంతో ల‌క్నో మోస్తారు స్కోరు చేసింది.

నిరాశ‌ప‌ర‌చిన డికాక్‌, దీప‌క్ హుడా...

ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతోన్న హిట్ట‌ర్ క్వింట‌న్ డికాక్ ఆరంభంలో రెండు ఫోర్లు కొట్టి కుదురుకున్న‌ట్లుగా క‌నిపించాడు. కానీ ఆ అంచ‌నా త‌ప్ప‌ని మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. కేవ‌లం ప‌ది ప‌రుగులు మాత్ర‌మే చేసి డికాక్‌ ఔట‌య్యాడు. దీప‌క్ హుడా కూడా ఎనిమిది ప‌రుగులు పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఓ వైపు వికెట్టు ప‌డుతోన్న కేఎల్ రాహుల్ మాత్రం ప‌ట్టుద‌ల‌గా క్రీజులో పాతుకుపోయాడు. ఆరంభంలో నెమ్మ‌దిగా ఆడిన అత‌డు ఆ త‌ర్వాత జోరు పెంచాడు. ఆయుష్ బ‌దోనితో క‌లిసి ల‌క్నో ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. కోల్‌క‌తా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంలో ధాటిగా ఆడ‌లేక‌పోయారు.

రాహుల్ 39 ర‌న్స్‌...

కేఎల్ రాహుల్ 27 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 39 ప‌రుగులు చేసి ఔట‌వ్వ‌గా...ఆయుష్ బ‌దోని 27 బాల్స్‌లో ఓ సిక్స‌ర్‌, రెండు ఫోర్ల‌తో 29 ర‌న్స్ చేశాడు. ఆల్‌రౌండ‌ర్ స్టోయిన‌స్ వ‌చ్చి రావ‌డంతోనే రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద క‌నిపించాడు. కానీ అత‌డిని తెలివిగా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బోల్తా కొట్టించాడు. దాంతో 14 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 111 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ల‌క్నో ఐదు వికెట్లు కోల్పోయింది.

నికోల‌స్ పూర‌న్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌...

ఈ ద‌శ‌లో బ్యాటింగ్ దిగిన నికోల‌స్ పూర‌న్ ల‌క్నోను గ‌ట్టెక్కించాడు. సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. 32 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 45 ర‌న్స్ చేశాడు. అత‌డి మెరుపుల‌తో ల‌క్నో 150 ప‌రుగులు ధాటింది. ధాటిగా ఆడుతోన్న అత‌డిని స్టార్క్ పెవిలియ‌న్ పంపించాడు. కృనాల్ పాండ్య‌, అర్ష‌ద్ ఖాన్ భారీ షాట్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. కేవ‌లం సింగిల్స్ మాత్ర‌మే తీయ‌డంలో ల‌క్నో ఇర‌వై ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కోల్‌క‌తా ముందు 162 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

నెటిజ‌న్ల ట్రోల్స్‌...

ల‌క్నో బ్యాటింగ్ తీరును క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది టీ20 మ్యాచ్‌లా లేద‌ని టెస్ట్‌ను త‌ల‌పించింద‌ని అంటున్నారు. కోట్లు పెట్టి కొన్న ఆట‌గాళ్లే ల‌క్నో కొంప ముంచుతున్నార‌ని అంటున్నారు. స్టోయిన‌స్ 9.20 కోట్లు, కేఎల్ రాహుల్ 17 కోట్లు, డికాక్ ఆరు కోట్లు, దీప‌క్ హుదా 5.75 కోట్లు ఇలా మ్యాచ్ ఆడిన ఆట‌గాళ్లు చాలా మంది ఐదు కోట్ల‌కుపైనే ఐపీఎల్‌లో అమ్ముడుపోయారు. కానీ అంద‌రూ క‌లిసి వంద ప‌రుగులు కూడా చేయ‌లేద‌ని విమ‌ర్శ‌లు కురిపిస్తోన్నారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా...వైభ‌వ్ అరోరా, సునీల్ న‌రైన్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌సెల్ ల‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది.

Whats_app_banner