Will Jacks RCB: ఐదు బాల్స్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన ఆర్‌సీబీ ప్లేయర్ - కౌంటీల్లో రికార్డ్
Will Jacks RCB: కౌంటీ క్రికెట్‌లో ఆర్‌సీబీ ప్లేయర్ విల్ జాక్స్ ఐదు బాల్స్‌లో ఐదు సిక్సర్లు కొట్టాడు. బ్యాట్‌తో మెరిసినా తమ జట్టును గెలిపించలేకపోయాడు విల్ జాక్స్.
Will Jacks RCB: కౌంటీ క్రికెట్‌లో ఆర్‌సీబీ ప్లేయర్ విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. కౌంటీ టీ20 బ్లాస్ట్ సిరీస్‌లో భాగంగా సర్రే, మిడిల్‌సెక్స్ టీమ్‌ల మధ్య గురువారం టీ20 మ్యాచ్ మ్యాచ్ జరిగింది. ఇందులో సర్రే టీమ్ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన విల్‌జాక్స్ కేవలం 45 బాల్స్‌లోనే ఏడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 96 రన్స్ చేశాడు.
అతడితో పాటు మరో ఓపెనర్ ఎవాన్స్ కూడా 37 బాల్స్‌లోనే ఐదు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 85 రన్స్‌తో చెలరేగాడు. తొలి వికెట్‌కు 12 ఓవర్లలోనే 170 పరుగులు చేశారంటే జాక్స్, ఎవాన్స్ ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మిడిల్‌సెక్స్ స్పిన్సర్ హోల్‌మన్ వేసిన 11వ ఓవర్‌లో విల్ జాక్స్ ఐదు బాల్స్‌లో ఐదు సిక్సర్లు కొట్టాడు.
చివరి బాల్‌కు సింగిల్ తీయడంతో ఆ ఓవర్‌లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. విల్ జాక్స్ ను ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది. మూడు కోట్ల ఇరవై లక్షలకు అతడిని భారీ పోటీ మధ్య దక్కించుకున్నది. కానీ గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే విల్ జాక్స్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని న్యూజిలాండ్ ప్లేయర్ బ్రాస్‌వెల్‌తో ఆర్‌సీబీ రీప్లేస్ చేసింది.
కాగా ఈ కౌంటీ మ్యాచ్‌లో సర్రే 252 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. సర్రే విధించిన భారీ టార్గెట్‌ను 19 ఓవర్లలోనే మిడిల్‌సెక్స్ ఛేదించింది. ఓపెనర్లు ఎస్కినాజి 39 బాల్స్‌లో 73 రన్స్, హోల్డన్ 35 బాల్స్‌లో 68 రన్స్‌తో మెరవడంతో మిడిల్ సెక్స్ లక్ష్యం దిశగా సాగింది. చివరలో హిగ్గిన్స్ 24 బాల్స్‌లోనే 48 పరుగులతో రాణించడంతో మిడిల్‌సెక్స్ 19.2 ఓవర్లలో 254 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నది.