KL Rahul vs Sarfaraz: కేఎల్ రాహుల్, సర్ఫరాజ్.. తుది జట్టులో ఉండేదెవరు? నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ
10 September 2024, 11:23 IST
- KL Rahul vs Sarfaraz: కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్.. ఈ ఇద్దరిలో తుది జట్టులో ఉండేది ఎవరు? బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్టుకు ఈ ఇద్దరూ ఎంపిక కావడంతో మిడిలార్డర్ లో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జరుగుతుండగా.. బీసీసీఐ మాత్రం దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్, సర్ఫరాజ్.. తుది జట్టులో ఉండేదెవరు? నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ
KL Rahul vs Sarfaraz: టీమిండియా చాలా రోజుల గ్యాప్ తర్వాత బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే జట్టును ఎంపిక చేయగా.. ఇప్పడు తుది జట్టులో ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ లలో మిడిలార్డర్ లో ఎవరిని తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది.
కేఎల్ రాహుల్ వర్సెస్ సర్ఫరాజ్
గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ను తిరిగి సెలెక్టర్లు ఎంపిక చేయడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. ఎందుకంటే ఇంగ్లండ్ తో సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఏమాత్రం భయం లేకుండా క్రీజులో స్వేచ్ఛగా సర్ఫరాజ్ ఆడిన తీరు మిడిలార్డర్ ను చాలా పటిష్టంగా మార్చింది.
దీంతో అతడు సీనియర్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు. మరోవైపు అనుభవంతోపాటు కొంతకాలంగా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న రాహుల్.. మిడిలార్డర్ లో ఉంటే బాగుంటుందన్న వాదనా వినిపిస్తోంది. ఇప్పటికే 50 టెస్టులు ఆడిన అనుభవం అతని సొంతం. ఇదే సర్ఫరాజ్ కంటే రాహుల్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపేలా చేస్తోంది.
రాహుల్‌కే ఓటేసిన బీసీసీఐ
తుది జట్టులో రాహులే ఉంటాడని బీసీసీఐ దాదాపు కన్ఫమ్ చేసింది. బోర్డుకు చెందిన ఓ అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. రాహుల్ ఆడతాడని స్పష్టం చేయడం గమనార్హం.
"టీమ్ ఎలా పని చేస్తుంది.. ఎలాంటి వ్యవస్థలు ఉంటాయన్నది బయట ఉండే వాళ్లకు అర్థం కాదు. రాహుల్ ఆడిన చివరి మూడు టెస్టులలో సౌతాఫ్రికాలో ఓ సెంచరీ చేశాడు. ఈ మధ్య కాలంలో ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటి. హైదరాబాద్ లో 86 రన్స్ చేశాడు.
గాయం కంటే ముందు అతడు ఆడిన చివరి మ్యాచ్ అది. అతడు గాయంతో దూరమయ్యాడు తప్ప పక్కన పెట్టలేదు. ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో ఫిఫ్టీ చేశాడు. మ్యాచ్ టైమ్ లభించింది. అతడే ఆడతాడు" అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో అన్నారు.
ఆస్ట్రేలియా టూర్ కోసమేనా?
ఈ ఏడాది చివర్లో టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ సమయానికి మళ్లీ పూర్తి ఫామ్ లోకి రావడం కీలకమని బోర్డు భావిస్తోంది.
గతంలో ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన అనుభవం అతని సొంతం. అందుకే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లతో రాహుల్ ను ఆ సవాలుకు సిద్ధం చేయాలని చూస్తున్నారు. పైగా రాహుల్ సిడ్నీ, లార్డ్స్, సెంచూరియన్ లాంటి మైదానాల్లో సెంచరీలు చేసిన అనుభవజ్ఞుడు.
పాకిస్థాన్ ను ఓడించి వస్తున్న బంగ్లాదేశ్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేకపోవడంతో టీమ్ అనుభవంవైపే చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అటు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తుది జట్టులో ఉండటమూ ఖాయమే. మరోవైపు అక్షర్ పటేల్, కుల్దీప్ లలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ ఇద్దరు స్పిన్నర్లలో తుది జట్టులో ఎవరుంటారన్నది చూడాలి.