KL Rahul: నెమ్మదిగా ఆడిన కేఎల్ రాహుల్‍.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు-kl rahul gets trolled by netizens after failure in duleep trophy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul: నెమ్మదిగా ఆడిన కేఎల్ రాహుల్‍.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

KL Rahul: నెమ్మదిగా ఆడిన కేఎల్ రాహుల్‍.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 07, 2024 09:36 PM IST

KL Rahul: భారత బ్యాటర్ కేఎల్ రాహుల్‍పై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. దులీప్ ట్రోఫీలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన అతడిపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ మ్యాచ్‍లో కూడా ఇలానా ఆడేది అంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

KL Rahul: నెమ్మదిగా ఆడిన కేఎల్ రాహుల్‍.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
KL Rahul: నెమ్మదిగా ఆడిన కేఎల్ రాహుల్‍.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍పై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంటుంది. అతడు నెమ్మదిగా ఆడిన ప్రతీసారి ఇది సాధారణమైపోయింది. అయితే, ఇప్పుడు దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’లోనూ ఇదే రిపీట్ అయింది. శుభ్‍మన్ గిల్ సారథ్యం వహిస్తున్న ఇండియా-ఏ తరఫున రాహుల్ ఈ టోర్నీలో ఆడుతున్నాడు. అయితే, ఇండియా-బీతో జరిగిన మ్యాచ్‍లో రాహుల్ నెమ్మదిగా పరుగులు చేయడంతో కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

111 బంతుల్లో 37 పరుగులు

ఇండియా-ఏ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడాడు. మొదటి నుంచి జాగ్రత్తగా ముందుకు సాగాడు. 111 బంతులు ఆడిన రాహుల్ కేవలం 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత 49వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‍లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. బంతిని పాడిల్ స్వీప్ ఆడబోయి మిస్ అయ్యాడు. దీంతో బంతి వికెట్లకు తిగిలి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియా-ఏ 231 పరుగులకు ఆలౌటైంది.

కేఎల్ రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కొందరు నెటిజన్లకు అసలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తున్నారు. దేశవాళీ టోర్నీలోనూ ఇలాగానే ఆడేది అంటూ పోస్టులు చేస్తున్నారు.

‘పరుగులు చేసే ఉద్దేశమే కనిపించలేదు’

కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు. అసలు పరుగులు చేయాలనే ఉద్దేశమే అతడి బ్యాటింగ్‍లో కనిపించలేదని ఓ యూజర్ పోస్ట్ చేశారు. బ్యాటింగ్‍కు సహకరిస్తున్న పిచ్‍పై ఇలానా ఆడేది అంటూ రాసుకొస్తున్నారు. దేశవాళీ మ్యాచ్‍లోనే ఇంత భయంగా ఆడితే ఎలా అని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు.

ఇతర బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న పిచ్‍పై రాహుల్ ఇలా నెమ్మదిగా ఆడడమేంటని ప్రశ్నిస్తున్నారు. దూకుడుగా ఆడితే రాహుల్ ఇంత కంటే ఎక్కువ పరుగులే చేయగలడని, ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఓ యూజర్ రాసుకొచ్చారు. 111 బంతుల్లో 37 రన్స్ చేయడం టెస్టుల్లో కూడా కరెక్ట్ కాదని, ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్టు ఎందుకు కనిపిస్తాడో తెలియడం లేదని ఓ యూజర్ పోస్ట్ చేశారు. మొత్తంగా రాహుల్‍పై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి.

దుమ్మురేపిన పంత్

ఇదే మ్యాచ్‍లో ఇండియా-బీ తరఫున బరిలోకి దిగిన రిషబ్ పంత్ ధనాధన్ ఆటతో దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్మురేపాడు. ధనాధన్ హాఫ్ సెంచరీ బాదాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍లోనే టీ20 రేంజ్ బ్యాటింగ్ చేశాడు. మూడో రోజును 6 వికెట్లకు 150 పరుగుల వద్ద ముగించింది ఇండియా-బీ. ఓవరాల్‍గా ప్రస్తుతం ఈ మ్యాచ్‍లో 240 పరుగుల ఆధిక్యంలో ఉంది.

బంగ్లాదేశ్‍తో రెండు టెస్టుల సిరీస్‍కు త్వరలోనే టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ తరుణంలో కేఎల్ రాహుల్ పేలవంగా ఆడటంతో అతడి ప్లేస్‍లో వేర్ ప్లేయర్‌ను తీసుకోవాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 19న భారత్, బంగ్లా టెస్టు సిరీస్ మొదలుకానుంది. టెస్టు సిరీస్ తర్వాత మూడు టీ20ల సిరీస్ కూడా ఉండనుంది.