Team India: 21 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి పంత్.. బంగ్లాతో టెస్టుకు టీమిండియా ఎంపిక.. యువ పేసర్‌కు తొలిసారి చోటు
Team India: బంగ్లాదేశ్‍తో తొలి టెస్టుకు భారత జట్టు ఎంపికైంది. టీమిండియా టెస్టు జట్టులోకి రిషబ్ పంత్ తిరిగి వచ్చేశాడు. ఓ కొత్త పేసర్‌కు తొలిసారి చోటు దక్కింది. టీమిండియా ఎలా ఉందంటే..
భారత టెస్టు జట్టులోకి రిషబ్ పంత్ మళ్లీ వచ్చేశాడు. బంగ్లాదేశ్‍తో తొలి టెస్టుకు అతడు ఎంపికయ్యాడు. 2022 డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‍తో మళ్లీ బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లు ఆడాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్నాడు. ఇప్పుడు భారత టెస్టు జట్టులోకి సుమారు 21 నెలల తర్వాత పంత్ తిరిగి వచ్చేశాడు. బంగ్లాదేశ్‍తో రెండు టెస్టుల సిరీస్‍కు గాను తొలి మ్యాచ్‍కు 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు నేడు (సెప్టెంబర్ 8) ప్రకటించారు.
బంగ్లాదేశ్‍తో భారత తొలి టెస్టు సెప్టెంబర్ 19న మొదలుకానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
టెస్టుల్లో కోహ్లీ ఈజ్ బ్యాక్
భారత టెస్టు జట్టులోకి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి వచ్చేశాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍ను వ్యక్తిగత కారణాలతో అతడు ఆడలేదు. ఇప్పుడు బంగ్లాతో టెస్టుతో రెడ్ బాల్ క్రికెట్‍లోకి కోహ్లీ మళ్లీ వచ్చాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు. యంగ్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్ తన స్థానాన్ని నిలుపుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్లేస్ దక్కించుకున్నాడు.
భరత్‍కు నిరాశ
వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధృవ్ జురెల్‍ను బంగ్లాతో టెస్టుకు భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా ఉన్న పంత్ తుది జట్టులో ఉండనున్నాడు. 21 నెలల తర్వాత టెస్టు జట్టులోకి పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. చివరగా బంగ్లాదేశ్‍తోనే 2022 డిసెంబర్‌లో టెస్టు ఆడాడు పంత్. మళ్లీ ఇప్పుడు తిరిగి టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఇక నిలకడగా ఆడలేకపోయిన తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్‍కు నిరాశే ఎదురైంది. బంగ్లాతో టెస్టుకు అతడిని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
బుమ్రా వచ్చేశాడు.. దయాల్‍కు తొలిసారి చోటు
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍ను టీమిండియా కైవసం చేసుకోవడంలో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత నుంచి అతడు విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్‍కు బుమ్రా వచ్చేశాడు. ఇక యంగ్ పేసర్ దశ్ దయాల్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‍లో రాణిస్తున్న అతడికి సెలెక్టర్లు బంగ్లాతో టెస్టుకు అవకాశమిచ్చారు. మహమ్మద్ సిరాజ్, అకాశ్ దీప్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు.
బంగ్లాదేశ్‍తో తొలి టెస్టుకు స్పిన్నర్లుగా సీనియర్ స్టార్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. మొత్తంగా బంగ్లాతో టెస్టులో పూర్తి సామర్థ్యంతోనే భారత్ బరిలోకి దిగుతోంది.
బంగ్లాదేశ్‍తో తొలి టెస్టుకు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‍ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19న మొదలుకానుండగా.. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. అయితే, ఇప్పటికి తొలి టెస్టుకే జట్టును టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేశారు. త్వరలోనే రెండో టెస్టు కోసం టీమ్‍ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.