BCCI Profit: జాక్‌పాట్ కొట్టిన బీసీసీఐ- రూ. 5,210 కోట్ల లాభం- 116 శాతం వృద్ధి- కారణాలు ఇవే!
BCCI Gets 5210 Crores Profit By IPL 2023: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 5 వేల 210 కోట్ల లాభాన్ని అర్జించింది. అంతేకాకుండా 116 శాతం వృద్ధిని చవిచూసింది. దీనంతటికి కారణం ఐపీఎల్ 2023 సీజన్. దీని ద్వారా బీసీసీఐ మొత్తం ఆదాయం 78 శాతం పెరిగింది. మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
BCCI Gets 5210 Crores Profit: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జాక్‌పాట్ కొట్టింది. ఏకంగా రూ. 5210 కోట్ల గణనీయమైన లాభాన్ని అర్జించింది. గత సంవత్సరంతో పోలిస్తే.. రూ. 2367 కోట్ల మిగులును సాధించుకుంది. ఈ ప్రకారం చూస్తే ఏకంగా 116 శాతం వృద్ధిని వెలుగుచూసింది బీసీసీఐ.
మరి ఈ లాభానికి, వృద్ధికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (ఐపీఎల్ 2023). ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ గణనీయమైన లాభాన్ని సాధించగలిగింది. అంతేకాకుండా బీసీసీఐ మొత్తం ఆదాయం 78 శాతం పెరిగి రూ.11,769 కోట్లకు చేరింది. దీనంతటికి ప్రధాన కారణం ఐపీఎల్ 2023 సీజన్ అని సమాచారం.
131 శాతం పెరిగి
ఐపీఎల్ 2023 సీజన్‌తో అమల్లోకి వచ్చిన న్యూ మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఆర్థిక విజయానికి మీడియా హక్కుల ఆదాయం ప్రధాన కారణమని, ఇది గత ఏడాది రూ. 3,780 కోట్ల నుంచి 131% పెరిగి రూ. 8,744 కోట్లకు చేరుకుందని నివేదిక తెలిపింది.
2023-2027 సీజన్‍కు సంబంధించి రూ. 48,390 కోట్ల విలువైన మీడియా హక్కుల ఒప్పందాన్ని బీసీసీఐ దక్కించుకోగా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రూ. 23,575 కోట్లకు, వయాకామ్ 18కు చెందిన జియో సినిమా ఓటీటీ రూ. 23,758 కోట్లకు డిజిటల్ హక్కులను దక్కించుకున్నాయి. అలాగే, ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా సన్స్‌కు ఐదేళ్ల కాలానికి రూ. 2,500 కోట్లకు విక్రయించారు.
ఇక అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌లను మైసర్కిల్ 11, రూపే, ఏంజెల్ వన్, సీట్ వంటి బ్రాండ్లకు అందించి వారి నుంచి మరో రూ. 1,485 కోట్లు రాబట్టింది బీసీసీఐ. 2023లో ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2023) కూడా బీసీసీఐ ఆర్థిక విజయానికి దోహదపడిందని, రూ. 377 కోట్ల లాభాన్ని ఆర్జించిందని ఓ నివేదిక పేర్కొంది.
66 శాతం ఖర్చు
మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్స్ ద్వారా డబ్ల్యూపీఎల్ ఆదాయం రూ. 636 కోట్లు రాగా.. ఖర్చు రూ. 259 కోట్లుగా ఉంది. ఐపీఎల్ 2023 కోసం బీసీసీఐ ఖర్చు 66 శాతం పెరిగి రూ. 6,648 కోట్లకు చేరుకుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్ నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బోర్డు రూ. 4,670 కోట్లు చెల్లించింది. ఇది గత సీజన్‌లో పంపిణీ చేసిన మొత్తం కంటే రెట్టింపుగా ఉంది.
మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ప్రాఫిట్ 38 శాతం పెరిగి రూ. 3,727 కోట్లకు చేరుకోగా మొత్తం ఆదాయం 50 శాతం పెరిగి రూ. 6,558 కోట్లకు చేరుకుంది. అలాగే, ఖర్చు 70 శాతం పెరిగి రూ. 2,831 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బీసీసీఐ జాక్ పాట్ కొట్టనుందని, బీసీసీఐ ఆర్థిక పరిస్థితి బలంగానే ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.
ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వివిధ పొదుపు, కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో బ్యాంకు బ్యాలెన్స్ రూ. 16,493.2 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక విజయాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారతదేశం పాల్గొనడం గురించి బీసీసీఐ సవాళ్లను ఎదుర్కొంటోంది.
రాజకీయ సంబంధాలు
భారత్-పాక్ మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి బదులుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్ మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్ వంటి తటస్థ వేదికలో నిర్వహించాలని కోరాలని బోర్డు యోచిస్తోంది.
బీసీసీఐ బలమైన ఆర్థిక పనితీరు ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్య శక్తిగా మారుతుంది. అయితే భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రెండు దేశాలు పాల్గొనే భవిష్యత్తు అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్‌ను క్లిష్టతరం చేయనున్నట్లు తెలుస్తోంది.