Paris Olympics BCCI: బీసీసీఐ పెద్ద మనసు.. పారిస్ ఒలింపిక్స్ కోసం బీసీసీఐ భారీ సాయం
Paris Olympics BCCI: పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్తున్న ఇండియన్ అథ్లెట్ల కోసం బీసీసీఐ పెద్ద సాయమే చేసింది. జులై 26 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ఒలింపిక్స్ లో మొత్తం 117 మంది ఇండియన్ అథ్లెట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
Paris Olympics BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేట సాగించబోతున్న ఇతర ఇండియన్ అథ్లెట్ల కోసం ఆర్థిక సాయం చేసింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)కు ఈ సాయాన్ని అందించారు.
ఐఓఏకు బీసీసీఐ సాయం
పారిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను పంపించడం, ఇతర ఖర్చులు భరించడం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)కు ఎప్పుడూ తలకు మించిన భారమే. ఈసారి కూడా ఆర్థిక సాయం కోసం ఎదురు చూసిన ఐఓఏను బీసీసీఐ ఆదుకుంది. ఇండియన్ క్రికెట్ బోర్డు ఈ గేమ్స్ కోసం రూ.8.5 కోట్ల సాయం చేసింది. ఈ విషయాన్ని జై షా చెప్పారు.
"పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అద్భుతమైన అథ్లెట్లకు బీసీసీఐ మద్దతుగా నిలుస్తోందని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. మేము దీనికోసం ఐఓఏకు రూ.8.5 కోట్లు ఇస్తున్నాం. మొత్తం ఇండియన్ టీమ్ కు మా బెస్ట్ విషెస్. ఇండియాను గర్వపడేలా చేయండి. జై హింద్" అని జై షా ట్వీట్ చేశారు.
117 మందితో ఒలింపిక్స్‌కు..
ఇండియా ఈసారి కూడా ఒలింపిక్స్ కు భారీ టీమ్ నే పంపిస్తోంది. మొత్తంగా 117 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ 2024లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 70 మంది పురుషులు కాగా.. 47 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. జులై 26 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ఒలింపిక్స్ లో మరోసారి రికార్డు మెడల్స్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో వీళ్లు బరిలోకి దిగుతున్నారు.
2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా ఏడు మెడల్స్ గెలిచింది. ఇప్పటి వరకూ ఒక ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన అత్యధిక మెడల్స్ ఇవే. ఈసారి ఆ రికార్డును మరింత మెరుగు పరిచే లక్ష్యంతో అథ్లెట్లు ఉన్నారు. టోక్యోలో ఒక గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఈసారి కూడా నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, మను బాకర్, నిఖత్ జరీన్, పీవీ సింధులాంటి అథ్లెట్లు మెడల్స్ పై ఆశలు రేపుతున్నారు.
40 ఏళ్ల తర్వాత గత ఒలింపిక్స్ లో మళ్లీ మెడల్ గెలిచిన ఇండియన్ హాకీ టీమ్ కూడా మెడల్ రేసులో ఉంది. జులై 26న పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. అయితే ఒక రోజు ముందే పోటీలు ప్రారంభం అవుతాయి. ఇక ఇండియన్ అథ్లెట్లు కూడా జులై 25న ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్లలో పాల్గొంటున్నారు. మరి ఈ ఒలింపిక్స్ మన 117 మంది అథ్లెట్ల బృందం ఏం చేస్తుందో చూడాలి.