Paris Olympics 2024 Indian Athletes: పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్స్‌పై ఆశలు రేపుతున్న ఇండియన్ అథ్లెట్లు వీళ్లే
Paris Olympics 2024 Indian Athletes: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియాకు మెడల్స్ అందించే అథ్లెట్లు ఎవరు? టోక్యో ఒలింపిక్స్ లో అత్యధికంగా ఏడు మెడల్స్ రాగా.. ఇప్పుడా నంబర్ ను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Paris Olympics 2024 Indian Athletes: పారిస్ ఒలింపిక్స్ 2024 మరో పది రోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. జులై 26న జరగబోయే ఓపెనింగ్ సెర్మనీతో ఈ విశ్వ క్రీడా సంబరం ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా 140 కోట్ల మంది భారతీయులు ఆశలు మోస్తూ 100కుపైగా అథ్లెట్లు ఒలింపిక్స్ బరిలో నిలవబోతున్నారు. మరి వీళ్లలో మెడల్స్ పై ఆశలు రేపుతున్న వాళ్లు ఎవరు? టోక్యోలో గెలిచిన ఏడు మెడల్స్ రికార్డును ఈసారి బ్రేక్ చేస్తుందా?
మెడల్స్ ఆశలు రేపుతున్న ఇండియన్ అథ్లెట్లు వీళ్లే
గతంలో ఎప్పుడూ లేని విధంగా 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా ఏడు మెడల్స్ గెలిచింది. ఒక ఒలింపిక్స్ ఎడిషన్ లో మన దేశం గెలిచిన అత్యధిక మెడల్స్ ఇవే. అందులో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో సాధించిన చారిత్రక గోల్డ్ మెడల్ కూడా ఒకటి. మరి ఈసారి మనకు మెడల్స్ అందించబోయేది ఎవరో ఒకసారి చూద్దాం.
నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)
టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అసలు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇండియా సాధించిన తొలి గోల్డ్ మెడల్ ఇది. ఈసారి కూడా అతడు మెడల్ పై ఆశలు రేపుతున్నాడు. గత మూడేళ్లలోనూ అతడు పాల్గొన్న ప్రతి ఈవెంట్లో విజేతగా నిలుస్తూ వస్తున్నాడు.
తన టార్గెట్ 90 మీటర్ల మార్క్ అందుకోలేకపోయినా.. ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడల్స్ గెలిచాడు. ఈసారి పావో నుర్మి గేమ్స్, ఫెడరేషన్ కప్ లలోనూ గోల్డ్ గెలిచి ఒలింపిక్స్ లో మరో మెడల్ కచ్చితంగా సాధించేలా కనిపిస్తున్నాడు.
సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్)
ఇండియాకు మెడల్ ఆశలు రేపుతున్న బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. ఈ మధ్యే ఫ్రెంచ్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్నారు. అంతేకాదు కొన్నాళ్ల పాటు వరల్డ్ నంబర్ డబుల్స్ ర్యాంక్ కూడా ఎంజాయ్ చేశారు.
సాత్విక్ ఈ మధ్యే భుజం గాయానికి గురవడమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. అతడు ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే మాత్రం ఈ జోడీ నుంచి ఒక మెడల్ ఖాయం అని చెప్పొచ్చు.
పీవీ సింధు (బ్యాడ్మింటన్)
ఇండియా తరఫున ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు ఈసారి కూడా మెడల్ పై ఆశలు రేపుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో ఆమె బ్రాంజ్ మెడల్ గెలిచింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.
ఇండోనేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ లలో నిరాశ పరిచింది. అంతేకాదు ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరితే అక్కడ ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో తలపడాల్సి రావడం కూడా సింధుకు సవాలుగా మారనుంది.
మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్)
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నుంచి మరో మెడల్ ఆశించవచ్చు. గత ఒలింపిక్స్ లో ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. ఈసారి కూడా ఫేవరెట్స్ లో ఒకరు. అయితే ఈ మధ్య వరుస గాయాలు ఆమెకు సవాలుగా మారనున్నాయి.
లవ్లీనా బోర్గొహైన్ (బాక్సింగ్)
టోక్యో ఒలింపిక్స్ లో అనూహ్యంగా బ్రాంజ్ మెడల్ గెలిచి స్టార్ గా మారిన బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్. గతంలో 69 కేజీల విభాగంలో తలపడగా.. ఈసారి 75 కేజీల విభాగంలో పోటీ పడనుంది. ఇదే ఈవెంట్లో గతేడాది వరల్డ్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ సాధించడం సానుకూలాంశం. ఈసారి కూడా ఆమె కచ్చితంగా మెడల్ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
నిఖత్ జరీన్ (బాక్సింగ్)
రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా మెడల్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. 2022 నుంచి 50 కేజీల విభాగంలో ఆమె కేవలం రెండే బౌట్లు ఓడిపోయింది. టాప్ ఫామ్ లో ఉన్న ఆమె.. పారిస్ ఒలింపిక్స్ లో ఏం చేస్తుందో చూడాలి.
మను బాకర్ (షూటింగ్)
గతేడాది వరల్డ్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మను బాకర్ ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్ లో పోటీ పడనుంది. మూడు ఈవెంట్లు కావడంతో మను బాకర్ కచ్చితంగా మెడల్ సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఇండియన్ మెన్స్ హాకీ టీమ్
40 ఏళ్ల తర్వాత మళ్లీ టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఇండియన్ మెన్స్ హాకీ టీమ్.. ఈసారి కూడా ఆశలు రేపుతోంది. అప్పుడు మెడల్ గెలిచిన జట్టులోని చాలా మంది ప్లేయర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ గేమ్స్ లో ఇండియా.. బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ లతో కలిసి పూల్ బిలో ఉంది.