Ireland vs Pakistan: ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ - వరల్డ్ కప్ గెలిచే జట్టేనా ఇది అంటూ ఫ్యాన్స్ ట్రోల్
11 May 2024, 9:51 IST
Ireland vs Pakistan: టీ20 వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్‌కు పసికూన ఐర్లాండ్ గట్టి షాకిచ్చింది. శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఐర్లాండ్ చిత్తుగా ఓడించింది. ఈ ఓటమిని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్
Ireland vs Pakistan: టీ20 వరల్డ్ కప్ ముగింట పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. పొట్టి ప్రపంచ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ తలపడుతోంది.
ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు పసికూన ఐర్లాండ్ గట్టి షాకిచ్చింది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఐర్లాండ్ చిత్తుగా ఓడించింది. టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం ఇదే మొదటిసారి.
బాబర్ ఆజాం హాఫ్ సెంచరీ...
ఈ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇరవై ఓవర్లలో 182 పరుగులు చేసింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం హాఫ్ సెంచరీతో (43 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు) రాణించాడు. సయీమ్ అయూబ్29 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 రన్స్, ఇఫ్తికార్ అహ్మద్ 15 బాల్స్‌లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 37 రన్స్ ఆకట్టుకున్నారు. భారీ స్కోరు చేయడంతో తమ జట్టుదే విజయమని పాకిస్థాన్ ఫ్యాన్స్ భావించారు.
మరో బాల్ మిగిలుండగానే...
కానీ పాకిస్థాన్ ఫ్యాన్స్ ఊహలను ఐర్లాండ్ పూర్తిగా తలక్రిందులు చేసింది. మరో బాల్ మిగులుండగానే పాకిస్థాన్ విధించిన భారీ టార్గెట్‌ను ఛేదించింది. ఐర్లాండ్ ఓపెనర్ అండ్రూ బల్బిరైన్ 55 బాల్స్‌లో పదిఫోర్లు, రెండు సిక్సర్లతో 77 రన్స్ చేసి ఐర్లాండ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బల్బిరైన్ తో పాటు హారీ టెక్టర్ 36 రన్స్, డాక్‌రెల్ 24 రన్స్‌తో ఆకట్టుకున్నారు. చివరలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ డెలానీ, కాంపర్ ఒత్తిడిని జయిస్తూ ఐర్లాండ్‌ను గెలిపించారు. చివరి ఓవర్‌లో ఐర్లాండ్ గెలుపుకు పది పరుగులు అవసరం కాగా...షాహిన్ అఫ్రిదీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన కాంపర్ ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.
పాక్ జట్టుపై ట్రోల్స్...
ఐర్లాండ్ చేతిలో తమ జట్టు ఓటమిని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీ20 కెప్టెన్, స్టార్ ప్లేయర్ బాబర్ ఆజాంతో పాటు మిగిలిన ఆటగాళ్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్ట్ అయిన ప్రధాన ఆటగాళ్లు మొత్తం ఈ మ్యాచ్‌లో బరిలో దిగారు. అయినా ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు .
ఇలాగైతే టీ20 వరల్డ్ కప్ ఏం గెలుస్తారు అంటూ ట్రోల్ చేస్తోన్నారు. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే ఇది బ్యాడ్ డే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. బాబర్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడిని కెప్టెన్ పదవి నుంచే కాకుండా జట్టులో నుండి తీసేయాలని డిమాండ్ చేస్తోన్నారు.
ఆర్మీ ట్రైనింగ్ డ్రామా...
టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ ప్లేయర్లు ఆర్మీ తరహాలో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ టీమ్ ఆర్మీ ట్రైనింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఆర్మీ
ట్రైనింగ్ మొత్తం డ్రామా అని, కేవలం పబ్లిసిటీ కోసం చేసిన జిమ్కిక్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ ఆర్మీ ట్రైనింగ్ డ్రామా మొత్తం ఒక్క మ్యాచ్‌తోనే తేలిపోయిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు.