Team India Schedule 2024: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్.. టీ20 వరల్డ్ కప్.. 2024లో టీమిండియా షెడ్యూల్ ఇదే
Team India Schedule 2024: ప్రతి ఏడాదిలాగే 2024లోనూ టీమిండియా షెడ్యూల్ తీరిక లేకుండా ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్.. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్‌తోపాటు టీ20 వరల్డ్ కప్ కూడా ఆడనుంది.
Team India Schedule 2024: టీమిండియాకు 2023 ఎంతో విజయవంతంగా నిలిచింది. వరల్డ్ కప్ గెలవలేకపోయినా.. ఆసియా కప్ విజయం, ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయాలు ఇండియన్ క్రికెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇక 2024 కోసం కొత్త ఆశలతో ఇండియన్ టీమ్ సిద్ధమైంది.
2024లో ఇండియా మొత్తం 12 టెస్టులు, 3 వన్డేలు, 9 టీ20లు ఆడనుంది. వీటికితోడు టీ20 వరల్డ్ కప్ కూడా ఆడనుంది. దాదాపు ప్రతి ఏటా ఏదో ఒక ఐసీసీ ఈవెంట్ జరుగుతూనే ఉండగా.. ఈ ఏడాది టీ20 కప్ అలరించనుంది. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఒకసారి చూద్దాం.
2024లో టీమిండియా షెడ్యూల్ ఇలా..
ఇండియా v సౌతాఫ్రికా
గత నెలలో మొదలైన సౌతాఫ్రికా పర్యటన త్వరలోనే ముగియనుంది. తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. జనవరి 3 నుంచి జరగబోయే రెండో టెస్టులో సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఇండియా v ఆఫ్ఘనిస్థాన్ (హోమ్ సిరీస్)
సౌతాఫ్రికా టూర్ ముగియగానే స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మరో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.
ఇండియా v ఇంగ్లండ్ (హోమ్ సిరీస్)
ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ టీమ్ ఇండియాకు రానుంది. జనవరి 25న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆరు వారాల పాటు ఈ సిరీస్ సాగనుంది. చివరిదైన ఐదో టెస్ట్ మార్చి 11న ప్రారంభమవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ రెండు టీమ్స్‌కూ చాలా ముఖ్యమైనదే.
టీ20 వరల్డ్ కప్ (వెస్టిండీస్, అమెరికా)
ఐపీఎల్ 2024 ముగియగానే టీమిండియా ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం కరీబియన్ దీవులు, అమెరికా వెళ్లనున్నారు. జూన్ 4 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 30న ముగుస్తుంది.
శ్రీలంక v ఇండియా (అవే సిరీస్)
టీ20 వరల్డ్ కప్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది టీమిండియా. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. షెడ్యూల్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.
ఇండియా v బంగ్లాదేశ్ (హోమ్ సిరీస్)
ఆగస్ట్‌లో టీమిండియాకు నెల రోజుల పాటు రెస్ట్ దక్కనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది.
ఇండియా v న్యూజిలాండ్ (హోమ్ సిరీస్)
బంగ్లాదేశ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ కూడా ఇండియాకు రానుంది. ఆ టీమ్‌తో ఇండియా మూడు టెస్టులు ఆడుతుంది.
ఆస్ట్రేలియా v ఇండియా (అవే సిరీస్)
ఏడాది చివర్లో నవంబర్, డిసెంబర్‌లలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్తుంది. ఈసారి టూర్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది.