Babar Azam: బాబర్ ఆజం మళ్లీ వచ్చినా మారని పాకిస్థాన్ తీరు.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో..-pakistan lost another match in the hands of new zealand b team captain babar azam talks about t20 world cup chances ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam: బాబర్ ఆజం మళ్లీ వచ్చినా మారని పాకిస్థాన్ తీరు.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో..

Babar Azam: బాబర్ ఆజం మళ్లీ వచ్చినా మారని పాకిస్థాన్ తీరు.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో..

Hari Prasad S HT Telugu
Apr 26, 2024 09:00 PM IST

Babar Azam: పాకిస్థాన్ తీరు మారలేదు. బాబర్ ఆజం మళ్లీ కెప్టెన్ గా వచ్చినా.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో వరుసగా రెండో టీ20లో ఓడింది. దీంతో ఆ టీమ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబర్ ఆజం మళ్లీ వచ్చినా మారని పాకిస్థాన్ తీరు.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో..
బాబర్ ఆజం మళ్లీ వచ్చినా మారని పాకిస్థాన్ తీరు.. న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో.. (AFP)

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ దారుణమైన ఫామ్ కొనసాగుతోంది. స్వదేశంలో అసలు స్టార్లే లేని న్యూజిలాండ్ బి టీమ్ చేతుల్లో వరుసగా రెండు టీ20ల్లో పాకిస్థాన్ ఓడింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో పాక్ టీమ్ 1-2తో వెనుకబడింది. తొలి టీ20 రద్దు కాగా.. రెండో టీ20లో పాక్ గెలిచింది. తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది.

పాకిస్థాన్ టీమ్‌పై ఫ్యాన్స్ గుస్సా

పాకిస్థాన్ టూర్ ను న్యూజిలాండ్ లైట్ తీసుకుంది. అసలు స్టార్లే లేని సెకండ్ రేట్ టీమ్ ను అక్కడికి పంపించింది. కానీ అలాంటి జట్టుపై కూడా పాక్ వరుసగా రెండు టీ20ల్లో ఓడటం అక్కడి అభిమానులకు మింగుడుపడటం లేదు. ఇది సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 25) రాత్రి జరిగిన నాలుగో టీ20లో పాక్ 4 పరుగుల తేడాతో ఓడింది.

ఇక సిరీస్ గెలిచే అవకాశం పాకిస్థాన్ కు లేదు. చివరి టీ20లో గెలిస్తే కనీసం డ్రాతో అయినా గట్టెక్కి పరువు నిలుపుకోవచ్చు. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో న్యూజిలాండ్ బి టీమ్ పై పాక్ ఓడటం వాళ్ల అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మధ్యే షహీన్ అఫ్రిదిని తప్పించి మళ్లీ బాబర్ ఆజంకు కెప్టెన్సీ అప్పగించినా.. పాక్ ఆటతీరులో మాత్రం మార్పు రాలేదు.

వరల్డ్ కప్ సమయానికి కుదురుకుంటాం: బాబర్

అయితే ఈ పరాజయాలను కెప్టెన్ బాబర్ ఆజం తేలిగ్గా తీసుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ తాము ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తున్నామని, టీ20 వరల్డ్ కప్ సమయానికి కుదురుకుంటామని అన్నాడు. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూన్ 9న ఇండియాతో పాకిస్థాన్ తలపడనుంది. చివరిసారి 2022 టీ20 వరల్డ్ కప్ లో ఆడినప్పుడు ఇండియానే గెలిచింది.

న్యూజిలాండ్ జట్టులోని కీలకమైన ప్లేయర్స్ అందరూ ఇప్పుడు ఐపీఎల్లో బిజీగా ఉండటంతో సెకండ్ రేట్ టీమ్ పాకిస్థాన్ వెళ్లింది. అలాంటి జట్టుపై అందరు స్టార్లతో కూడిన పాక్ టీమ్ సులువుగా గెలుస్తుంది అనుకుంటే.. స్వదేశంలోనూ ఈ ఓటములు అభిమానులను నిరాశకు గురి చేశాయి. కొంతకాలంగా పాక్ టీమ్ దారుణమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది.

గతేడాది ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ లో ఆ టీమ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. దీంతో కెప్టెన్ బాబర్ ఆజం తప్పుకున్నాడు. అతని స్థానంలో షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ అప్పగించారు. కానీ అతని సారథ్యం మూడు నెలల పాటే సాగింది. పాక్ టీమ్ ఫలితాల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో మరోసారి అతన్ని తప్పించి బాబర్ ఆజంనే కెప్టెన్ గా తీసుకొచ్చారు.

టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతోపాటు పాకిస్థాన్ గ్రూప్ ఎలో ఉంది. ఈ గ్రూప్ లో ఆతిథ్య యూఎస్ఏతోపాటు ఐర్లాండ్, కెనడా కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ జూన్ 2 నుంచి జూన్ 29 వరకూ జరగనుంది.

IPL_Entry_Point