T20 World Cup Jersey: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ కావాలా? ఇలా కొనండి.. రేటు మాత్రం ఘాటే
T20 World Cup Jersey: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ప్లేయర్స్ వేసుకునే జెర్సీలను లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ జెర్సీలు ఇప్పుడు అడిడాస్ స్టోర్లలో అమ్మకానికి కూడా వచ్చేశాయి.
T20 World Cup Jersey: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా కొత్త జెర్సీల్లో అడుగుపెట్టబోతోంది. వీటిని సోమవారం (మే 6) అధికారిక టీమ్ కిట్ స్పాన్సర్ అడిడాస్ లాంచ్ చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడీ కొత్త జెర్సీలను అభిమానులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ జెర్సీలు దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లతోపాటు ఆన్‌లైన్ లో కొనుగోలు చేయొచ్చంటూ మంగళవారం (మే 7) ట్వీట్ చేసింది.
టీ20 వరల్డ్ కప్ జెర్సీ ధర ఎంతంటే?
మెన్ ఇన్ బ్లూ ఎప్పుడూ వేసుకొనే బ్లూ కలర్ లోనే ఈ కొత్త జెర్సీని కూడా తీసుకొచ్చారు. భుజాలపై మూడు రంగుల చారలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికాల్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కొత్త జెర్సీలను కొనుగోలు చేసే వీలు కల్పించింది అడిడాస్.
వీటిని దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్ల నుంచి కానీ లేదంటే adidas.co.in వెబ్‌సైట్ నుంచి కానీ కొనుగోలు చేయొచ్చని ట్వీట్ చేసింది. ఈ జెర్సీలు కావాలంటే ఒక్కో అభిమాని రూ.5999 చెల్లించాల్సిందే. ఇది ప్లేయర్స్ ఎడిషన్ జెర్సీ ధర. ఇంత ధర పెట్టలేం అనుకుంటే.. ఫ్యాన్స్ కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్ జెర్సీలు రూ.999కే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇక వెంటనే టీమిండియా జెర్సీలను కూడా కొనేసేయండి.
ఈ కొత్త జెర్సీ ఆవిష్కరణను కూడా అడిడాస్ వినూత్న పద్ధతిలో చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ భారీ జెర్సీని హెలికాప్టర్ మోసుకొస్తున్నట్లుగా చూపించారు. ఈ వీడియో వైరల్ అయింది. ఇండియన్ టీమ్ కొత్త జెర్సీపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు తమకు ఈ జెర్సీ పెద్దగా నచ్చలేదని కామెంట్స్ చేయడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా
టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తంగా 20 టీమ్స్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇన్ని టీమ్స్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. టీమిండియా గ్రూప్ ఎలో ఉంది. ఇండియాతోపాటు ఇందులో పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏలు ఉన్నాయి. వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 5న ఐర్లాండ్ తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది.
జూన్ 9న పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. 2022 టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ వరకూ వెళ్లి అక్కడ ఇంగ్లండ్ చేతుల్లో ఓడిన ఇండియన్ టీమ్.. ఈసారి భారీ అశలే పెట్టుకుంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లిలాంటి వాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు ఉండటంతో టీమ్ కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.