IPL 2025 Auction Date: భారత్ వెలుపలే ఐపీఎల్ 2025 మెగా వేలం.. ప్లేస్, తేదీలను బీసీసీఐ ఫిక్స్!
04 November 2024, 16:22 IST
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈసారి భారత్ స్టార్ క్రికెటర్లతో పాటు విదేశీ పవర్ హిట్టర్లు కూడా ఉన్నారు. రెండు రోజుల జరగబోతున్న ఈ వేలానికి సంబంధించి అప్‌డేట్ వచ్చింది.
ఐపీఎల్ 2025 మెగా వేలం
ఐపీఎల్ 2025 మెగా వేలంపై క్లారిటీ వచ్చేసింది. అక్టోబరు 31న టోర్నీలోని ఫ్రాంఛైజీలన్నీ తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని ప్రకటించి..మిగిలిన వారిని వేలానికి వదిలేసింది. ఓవరాల్‌గా రూ.558.5 కోట్లని ఖర్చు చేసిన 10 ఫ్రాంఛైజీలు 46 మందిని మాత్రమే అట్టిపెట్టుకున్నాయి. ప్రతి ఫ్రాంఛైజీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.120 కోట్లు చొప్పున కేటాయించగా.. ఇందులో వేలం కోసం రూ.75 కోట్లని గరిష్టంగా ఖర్చు చేసుకునే వెసులబాటు ఇచ్చింది. కానీ.. కొన్ని ఫ్రాంఛైజీలు మాత్రం ఇందులో సగం మాత్రమే ఖర్చు చేసి.. వేలం కోసం దాచుకున్నాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబరు ద్వితీయార్థంలో ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ చెప్పింది. కానీ.. తేదీలు, వేలం జరిగే ప్లేస్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మెగా వేలం కావడంతో కనీసం 2 రోజులు వేలం జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా వెలువడిన వార్తల ప్రకారం.. నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఆతిథ్యం ఇవ్వనుంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే
- చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ
- ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్
- గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్, శుభమన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్
- కోల్‌కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్
- లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని
- ముంబయి ఇండియన్స్: జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ
- పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
- రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సిమ్రాన్ హెట్‌మెయర్, సందీప్ శర్మ
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రజిత్ పటీదార్, యశ్ దయాల్
- సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్.
అందరి చూపు పంత్ వైపు
ఐపీఎల్ 2025 వేలంలో చాలా మంది స్టార్ క్రికెటర్లు ఈసారి ఉన్నారు. భారత్‌కి చెందిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో పాటు జోస్ బట్లర్, ఐడెన్ మార్క్‌రామ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ భారీ ధర పలికే అవకాశం ఉంది. అలానే లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, శామ్ కరన్, హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ తదితర విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడనున్నాయి.
వేలానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ.110.5 కోట్లతో రాబోతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్స్‌లో రూ.83 కోట్లు ఉన్నాయి. ముంబయి వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.