Team India: కోహ్లి, రోహిత్‌తోపాటు ఆ ఇద్దరు సీనియర్లూ ఔట్.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బీసీసీఐ!
Team India: న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ అయిన టీమిండియాపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది బీసీసీఐ. రోహిత్, కోహ్లితోపాటు అశ్విన్, జడేజా స్వదేశంలో తమ చివరి టెస్టు ఆడేసినట్లే అని బోర్డు వర్గాలు చెప్పడం గమనార్హం.
Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు అశ్విన్, జడేజాలాంటి సీనియర్లు స్వదేశంలో తమ చివరి టెస్టు ఆడేసినట్లేనా? తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. టీమిండియా వైట్ వాష్ ను బీసీసీఐ ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. స్వదేశంలో జరిగిన ఈ ఘోర అవమానం తర్వాత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఆ నలుగురూ ఔట్
న్యూజిలాండ్ చేతుల్లో టీమిండియా వైట్ వాష్ టీమ్ లోని సీనియర్లను డేంజర్ లో పడేశాయి. ఈ ఓటమికి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వైఫల్యాలే ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చివరి టెస్టులో కనీసం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. దీంతో బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పీటీఐ రిపోర్టు వెల్లడించింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, జడేజా కలిసి స్వదేశంలో తమ చివరి టెస్టు ఆడేసినట్లే అని.. వీళ్లలో కొందరిపై వేటు తప్పదని ఆ రిపోర్టు తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితమే ఈ నలుగురి భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించలేకపోతే ఇంగ్లండ్ సిరీస్ కు వీళ్లందరినీ పక్కన పెట్టడం ఖాయమని స్పష్టం చేసింది.
చీఫ్ సెలక్టర్‌తో గంభీర్ చర్చ
న్యూజిలాండ్ తో వైట్ వాష్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో మాట్లాడాడు. ఇది కొన్ని కఠినమైన నిర్ణయాలకు దారి తీయబోతోందని భావిస్తున్నారు. "చర్యలు తప్పవు. టీమ్ నవంబర్ 10న ఆస్ట్రేలియాకు వెళ్లబోతోంది కాబట్టి వీళ్ల సమావేశం అనధికారికంగా జరిగింది. కానీ ఇది దారుణమైన పరాభవం. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుండటం, ఇప్పటికే టీమ్ అనౌన్స్ చేయడంతో ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయాలు ఉండవు" అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు పీటీఐ రిపోర్టు తెలిపింది.
"ఒకవేళ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించకపోతే మాత్రం ఇంగ్లండ్ కు వెళ్లే జట్టులో ఆ నలుగురు సూపర్ సీనియర్లు జట్టులో ఉండరు. ఎలా చూసినా ఆ నలుగురూ కలిసి స్వదేశంలో తమ చివరి టెస్టు ఆడేసినట్లే" అని కూడా బోర్డు అధికారి చెప్పినట్లు పీటీఐ రిపోర్టు వెల్లడించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ పోయినట్లేనా?
న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ తర్వాత టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును 4-0తో ఓడిస్తేనే ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది. కానీ అది జరగడం అంత సులువు కాదని అందరికీ తెలుసు. ఒకవేళ ఫైనల్ చేరడంలో విఫలమైతే మాత్రం సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్స్ ను ఇంగ్లండ్ పంపించే అవకాశం ఉంది.
అశ్విన్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్, జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయొచ్చు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రదర్శనపై అటు అభిమానులు, ఇటు బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్వదేశంలో కూడా బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయిన వీళ్లను తప్పించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.