భారత్ టీ20 జట్టు నవంబరు రెండో వారం నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌కి టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా వీవీఎస్ ఉన్నాడు.
నవంబరు ఆరంభంలోనే దక్షిణాఫ్రికా గడ్డపైకి వెళ్లనున్న భారత్ టీ20 జట్టు.. అక్కడ నవంబరు 8 నుంచి నవంబరు 15 వరకు వరుసగా 4 టీ20ల సిరీస్‌ను ఆడనుంది. ఇదే సమయంలో భారత్ టెస్టు జట్టు ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది. దాంతో భారత్ టెస్టు జట్టుతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లనున్నాడు. ఆస్ట్రేలియాలో నవంబరు 22 నుంచి జనవరి 8, 2025 వరకు టీమిండియా టెస్టులు ఆడనుంది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం గత వారం వేర్వేరుగా భారత్ జట్లని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబరు 3న దక్షిణాఫ్రికా గడ్డపైకి భారత్ టీ20 జట్టు బయల్దేరనుండగా.. ఆస్ట్రేలియా పర్యటన కోసం నవంబరు 10న భారత్ టెస్టు జట్టు ఆస్ట్రేలియా గడ్డపైకి బయల్దేరనుంది.
వాస్తవానికి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగించుకుని ఆస్ట్రేలియా పర్యటనకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లొచ్చు. కానీ.. వరుసగా సిరీస్‌తో బిజీగా ఉన్న గంభీర్‌కి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో వరుసగా టెస్టు సిరీస్, టీ20 సిరీస్.. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో గంభీర్ జట్టుతోనే ఉన్నాడు.
కివీస్‌తో ఇటీవల వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో భారత్ జట్టు ఓడిపోవడంతో గంభీర్‌పై తీవ్ర విమర్శలు రావడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముంగిట అతనికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు.
దక్షిణాఫ్రికా టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. అతనికి తోడుగా సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్, శభాదీప్ ఘోష్ కోచింగ్ స్టాఫ్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్ యంగ్ జట్టుకి బహుతులే (హెడ్ కోచ్), కనిత్కర్ (బ్యాటింగ్ కోచ్), ఘోష్ (ఫీల్డింగ్ కోచ్)గా పనిచేశారు.
వాస్తవానికి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ముందుగా షెడ్యూల్ చేయలేదు. ఇటీవల బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) మధ్య సడన్‌గా ఒప్పందం కుదిరింది. టీ20 సిరీస్‌లో మ్యాచ్‌లు వరుసగా నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో డర్బన్, గెకెబర్హా, సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌లలో జరగనున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్