తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే!: టోర్నీ చైర్మన్ ఏం చెప్పారంటే..

IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే!: టోర్నీ చైర్మన్ ఏం చెప్పారంటే..

20 February 2024, 17:42 IST

google News
    • IPL 2024 Update: లోక్‍సభ ఎన్నికలు ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ భారత్‍లో జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఐపీఎల్ షెడ్యూల్ కూడా వెల్లడి కాలేదు. ఈ తరుణంలో ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా కొన్ని విషయాలను వెల్లడించారు. 
IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే!: టోర్నీ చైర్మన్ ఏం చెప్పారంటే..
IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే!: టోర్నీ చైర్మన్ ఏం చెప్పారంటే.. (IPL)

IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే!: టోర్నీ చైర్మన్ ఏం చెప్పారంటే..

IPL 2024: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారత్‍లో జరుగుతుందా.. వేరే దేశానికి మారుతుందా అనే సందిగ్ధత నెలకొని ఉంది. దేశంలో ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికలు జరగనుండటంతో టోర్నీ నిర్వహణ విషయంపై అనిశ్చితి నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ 17వ సీజన్ వేరే దేశంలో జరుగుతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా స్పందించారు. ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం తాము ఎదురుచూస్తున్నామని, దాని ప్రకారం ఐపీఎల్‍ను ప్లాన్ చేస్తామని ఐఏఎన్‍ఎస్‍తో ధుమాల్ చెప్పారు. “లీగ్‍ను తప్పకుండా ఇండియాలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం, సంస్థలతో కలిసి పని చేస్తాం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం మేం ఎదురుచూస్తున్నాం. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తాం. ఆ మ్యాచ్‍ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం.. అక్కడ ఎన్నికలు ఏ తేదీలో ఉంటాయి.. అనే లాంటి అంశాలను పరిశీలించి ప్లాన్ చేస్తాం” అని అరుణ్ ధుమాల్ చెప్పారు.

ఐపీఎల్ ప్రారంభం అప్పుడేనా!

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22వ తేదీన మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని ధుమాల్ కన్ఫర్మ్ చేయలేదు. “మార్చి చివర్లో లీగ్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‍లో ఉంటాయి. ప్రభుత్వ సహకారంతో మేం పని చేస్తాం” అని అరుణ్ ధుమాల్ చెప్పారు.

ఎన్నికలు ఉంటే ఆయా రాష్ట్రాలు ఐపీఎల్ మ్యాచ్‍లకు రక్షణ చర్యలు కల్పించేందుకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే.. పోలింగ్ ఉన్న తేదీలో కాకుండా వేరే రోజుల్లో మ్యాచ్‍లు నిర్వహించేలా ప్లాన్ చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.

ఈ ఏడాది ఐపీఎల్‍ను మార్చి 22వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు జరుగుతుందని తెలుస్తోంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే తేదీలను బీసీసీఐ ఖరారు చేయనుంది.

2009లో ఎన్నికల కారణంగా ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో జరిగింది. అయితే, 2014, 2019ల్లోనూ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఇండియాలోనే టోర్నీని బీసీసీఐ నిర్వహించింది. ఈసారి కూడా స్వదేశంలోనే జరిపేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తోంది.

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్, ఐదుసార్లు టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్.. మార్చి తొలి వారం నుంచే ట్రైనింగ్ క్యాంప్ మెదలుపెట్టనుంది. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఇతర ఫ్రాంచైజీలు కూడా మార్చి ఆరంభం నుంచే కసరత్తులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 2024 సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్‍గా తప్పించి హార్దిక్ పాండ్యాను ఆ స్థానంలో నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకొని మరీ అతడిని సారథిగా చేసింది. దీంతో తన పాత ఫ్రాంచైజీ ముంబై తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నాడు హార్దిక్. మరోవైపు, యాక్సిడెంట్ వల్ల గతేడాది టోర్నీకి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో అతడు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం