Rishabh Pant in IPL: ఐపీఎల్లో రిషబ్ పంత్ ప్రతి మ్యాచ్ ఆడతాడు కానీ..: రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rishabh Pant in IPL: కారు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. అతని ఫిట్‌నెస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Rishabh Pant in IPL: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏడాదిపైనే అయింది. ఈ మధ్యే అతడు మళ్లీ క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఆడతాడా లేదా అన్నదానిపై ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. పంత్ ప్రతి మ్యాచ్ ఆడటానికి సిద్ధంగానే ఉన్నాడని, అయితే ఈ విషయంలో తాము ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
రిషబ్ పంత్ రెడీ
రిషబ్ పంత్ 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది మొత్తం అతడు క్రికెట్ కు దూరమయ్యాడు. మరి ఈ ఏడాదైనా పంత్ ఐపీఎల్లో ఆడతాడా అన్న ప్రశ్నకు రికీ పాంటింగ్ సమాధానమిచ్చాడు. బుధవారం (ఫిబ్రవరి 7) మేజర్ క్రికెట్ లీగ్ లోని వాషింగ్టన్ ఫ్రీడమ్ కోచ్ గా నియమితుడైన తర్వాత మీడియాతో పాంటింగ్ మాట్లాడాడు.
"తాను ఆడతానని రిషబ్ పంత్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే అది ఎలా అన్నది మాత్రం తెలియదు. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు. కానీ ఐపీఎల్లో తొలి మ్యాచ్ కు ఇంకా ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. అందువల్ల పంత్ వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ మేము అతన్ని అడిగితే మాత్రం.. ప్రతి మ్యాచ్ ఆడతా.. వికెట్ కీపింగ్ కూడా చేస్తా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతా అని పంత్ కచ్చితంగా అంటాడు. కానీ మేము మాత్రం అతని విషయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం" అని పాంటింగ్ అన్నాడు.
పంత్ బతికి బట్టకట్టడమే అద్భుతం
కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ అసలు అందులో నుంచి బతికి బట్టకట్టడమే అద్భుతమని పాంటిగ్ చెప్పాడు. "అతడో డైనమిక్ ప్లేయర్. అతడే మా కెప్టెన్. గతేడాది అతని సేవలను చాలా మిస్ అయ్యాం. గత 12, 13 నెలలుగా అతని ప్రయాణాన్ని చూస్తే.. అది చాలా భయానకమైన ఘటన. క్రికెట్ ఆడటం తర్వాత.. అసలు బతికి ఉండటమే అదృష్టమని అతడు భావిస్తూ ఉండొచ్చు. ఐపీఎల్లో అతడు ఆడాలని మేము కోరుకుంటున్నాం. అన్ని మ్యాచ్ లు కాకపోయినా.. 14 మ్యాచ్ లలో కనీసం 10 ఆడినా మంచిదే. అంతకంటే ఎక్కువ ఆడితే బోనస్ గా భావిస్తాం" అని పాంటింగ్ అన్నాడు.
గతేడాది రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఇబ్బండి పడింది. పాయింట్ల టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది మాత్రం పంత్ ఐపీఎల్ ఆడతాడని ఢిల్లీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఆ మధ్య ప్రమాదం తర్వాత అతడు తొలిసారి గ్రౌండ్ లోకి దిగి క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. నిజానికి ఆ ప్రమాదం నుంచి తాను ప్రాణాలతో బయటపడటం అద్భుతమే అని పంత్ కూడా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.