IPL 2024 start date: ఐపీఎల్ ప్రారంభమయ్యేది ఆ రోజే.. రెండు నెలలకుపైగా సాగనున్న లీగ్
IPL 2024 start date: ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుందని క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది. ఈ మెగా లీగ్ రెండు నెలలకుపైగా సాగి మే 26న ముగియనుందని కూడా తెలిపింది.
IPL 2024 start date: ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యేది ఎప్పుడు? 17వ సీజన్ ప్రారంభం, షెడ్యూల్ పై బీసీసీఐ ఓ అంచనాకు వచ్చినా.. ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ తేదీల ప్రకటన తర్వాతే షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది. అయితే మార్చి 22 నుంచి మే 26 వరకూ ఐపీఎల్ జరగనున్నట్లు క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది.
అయితే సరిగ్గా ఆ సమయంలోనే దేశంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనుండటంతో టోర్నీ ఇండియాలోనే జరుగుతుందా లేక విదేశాలకు వెళ్తుందా అన్నదానిపై స్పష్టత లేదు.
డబ్ల్యూపీఎల్ తర్వాతే..
ఈ ఏడాది వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ జరగనుంది. ఈ లీగ్ ను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకూ నిర్వహించనున్నారు. అది ముగిసిన ఐదు రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు క్రిక్‌బజ్ రిపోర్టు తెలిపింది. ఇక ఈసారి ఐపీఎల్ ఫైనల్ మే 26న జరగనున్నట్లు కూడా వెల్లడించింది.
అంటే టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి సరిగ్గా ఐదు రోజుల ముందు వరకూ లీగ్ జరగనుంది. ఇక ఆ మెగా టోర్నీలో ఇండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకు 9 రోజుల ముందు ఐపీఎల్ ముగుస్తుంది. అయితే దేశంలో సాధరణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాతే ఐపీఎల్ తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
మరోవైపు డబ్ల్యూపీఎల్ మాత్రం ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 మధ్య జరగనుంది. ఈసారి లీగ్ ను బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలో నేడో, రేపో రానుంది. గతేడాదే తొలిసారి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి సీజన్లో ఐదు జట్లు పాల్గొన్నాయి.
ప్రతి ఐదేళ్లకోసారి ఇలాగే..
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత ఏడాది అంటే 2009లోనే జనరల్ ఎలెక్షన్స్ జరిగాయి. లీగ్, ఎన్నికలు ఒకేసారి రావడంతో ఐపీఎల్ కు భద్రత అందివ్వడం కుదరలేదు. దీంతో ఆ ఏడాది లీగ్ సౌతాఫ్రికాలో జరిగింది. ఇక 2014, 2019లలోనూ ఇలాగే జరిగింది. 2014లో సగం మ్యాచ్ లో యూఏఈలో, సగం మ్యాచ్ లు ఇండియాలో జరిగాయి.
2019లోనూ ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు కూడా టోర్నీని వేరే దేశాలకు తరలిస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరికి ఇండియాలోనే నిర్వహించారు. ఈసారి కూడా దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
“ఐపీఎల్ వేదికను మార్చాలా వద్దా అనే విషయంపై భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల తర్వాతే ఓ నిర్ణయం వస్తుంది” అని చిట్‍చాట్‍లో రాజీవ్ శుక్లా చెప్పినట్టు ఇన్‍సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది.
టోర్నీకి మరో రెండు నెలల సమయం ఉంది. ఆలోపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ వస్తే..దానిని బట్టి ఓ నిర్ణయానికి రావాలని బోర్డు భావిస్తోంది.