Ricky Ponting : ఈ ముగ్గురూ భారత్‌కు భవిష్యత్ సూపర్ స్టార్స్.. రికీ పాంటింగ్ జోస్యం
Ricky Ponting On Team India : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. భారత టెస్టు క్రికెట్‌లో మెరుపులు మెరిపించగల ముగ్గురు క్రికెటర్లను ఎంపిక చేశాడు. వారు భవిష్యత్ సూపర్ స్టార్స్ అని జోస్యం చెప్పాడు.
అత్యధిక ప్రపంచకప్‌లు గెలిచిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డును లిఖించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting).. భారత టెస్టు క్రికెట్‌లో మెరుపులు మెరిపించగల ముగ్గురు క్రికెటర్లను ఎంపిక చేశాడు. టీమ్ ఇండియాలోని ముగ్గురు యువ బ్యాట్స్‌మెన్‌లపై చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేసిన పాంటింగ్, జైస్వాల్‌ను తన మొదటి ఎంపికగా ఎంచుకున్నాడు. జైస్వాల్ ఐపీఎల్(IPL) ప్రదర్శనతో అతని ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాడు. భవిష్యత్తులో జాతీయ జట్టులో జైస్వాల్(Jaiswal) అద్భుత విజయాలు సాధిస్తాడని అన్నాడు.
'జైస్వాల్‌కి ఈ IPL ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను. ఓవర్‌నైట్ సూపర్‌స్టార్ అయ్యాడు. అతను ప్రతిభావంతుడైన యువకుడని అందరికీ తెలుసు. కానీ ఈ సంవత్సరం IPLలో అతను అన్ని రకాల ప్రతిభను కలిగి ఉన్నాడని నేను గమనించాను.' అని పాంటింగ్ పేర్కొన్నాడు
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. డొమినికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 387 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు. 150 పరుగులు చేసే వరకు ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ ఈ సమయంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. భారత్ తరఫున అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు.
అలాగే పాంటింగ్ తన రెండో ఎంపికగా రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad)ను ఎంచుకున్నాడు. రుతురాజ్ కూడా జైస్వాల్ వంటి ప్రతిభావంతుడైన క్రికెటర్ అని తెలిపాడు. రాబోయే రెండేళ్లలో వీరిద్దరూ ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌లుగా మారగలరని భావిస్తున్నానని వెల్లడించాడు. యువ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్.. ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల జట్టుకు కెప్టెన్‍గా వ్యవహరించనున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు శాశ్వత ఆటగాడిగా మారగల ప్రతిభ సర్ఫరాజ్(Sarfaraz)కు ఉందని పాంటింగ్ జోస్యం చెప్పాడు. అందుకే రానున్న రోజుల్లో టెస్టు జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకుంటాడని తెలిపాడు. అయితే సర్ఫరాజ్ మాత్రం ఇంకా టెస్టు క్రికెట్లోకి సెలక్ట్ కాలేదు. తనపేరిట రికార్డులు ఉన్నా అన్యాయమే జరుగుతోందని ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ బాధపడుతున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు, టన్నుల కొద్దీ రన్స్ చేసినా సెలక్టర్లు అతనికి మొండిచేయే చూపిస్తున్నారు. వెస్టిండీస్ టూర్ కు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.