IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభం ఆ తేదీనే!
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడు ఆరంభం కానుందో తేదీ బయటికి వచ్చింది. ఇప్పటికే ఆటగాళ్ల అందబాటుపై ఫ్రాంచైజీలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. ఆ వివరాలివే..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. ఈ సీజన్ కోసం రేపు (డిసెంబర్ 19) మినీ వేలం దుబాయ్‍లో జరగనుంది. రానున్న సీజన్ కోసం ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్, ట్రేడ్‍లు జరిగాయి. రేపటి మినీ వేలం ముగిశాక దాదాపు జట్లు ఎలా ఉండనున్నాయో తేలిపోనుంది. అయితే, ఈ తరుణంలో ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడు మొదలు కానుందో సమాచారం బయటికి వచ్చింది.
ఐపీఎల్ తదుపరి సీజన్‍ను 2024 మార్చి 22వ తేదీన ప్రారంభం కానుందని సమాచారం బయటికి వచ్చింది. మే చివరి నాటికి ఈ సీజన్‍ను ముగించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే, దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍ను ఎన్నికల కమిషన్ ప్రకటించాక.. ఐపీఎల్ సీజన్‍కు తేదీలను ఖరారు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే, మార్చి 22న ప్రారంభించాలని ఇప్పటికే ప్లాన్ చేసిందని, ఈ మేరకు ఫ్రాంచైజీలకు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
పూర్తి సీజన్‍కు ఆ దేశాల ఆటగాళ్లు
తమ జట్టులోని ఆటగాళ్ల అందుబాటు గురించి కూడా ఫ్రాంచైజీలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‍కు తెలియజేశాయని కూడా సమాచారం బయటికి వచ్చింది. ఐపీఎల్‍కు ఎంపికైన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లందరూ వచ్చే ఏడాది ఐపీఎల్ పూర్తి సీజన్‍కు అందుబాటులో ఉండనున్నారు. అలాగే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తం సీజన్‍కు అందుబాటులో ఉంటారో, అంతర్జాతీయ క్రికెట్ వల్ల కొన్ని మ్యాచ్‍లకు దూరం కావాల్సి ఉంటుందో ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2023 16వ సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ముంబై ఇండియన్స్ జట్టును చెన్నై సమం చేసింది.
2024 ఐపీఎల్ సీజన్ కోసం రేపు (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా మినీ వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేలం మొదలుకానుంది. భారత్ వెలువల ఐపీఎల్ వేలం జరగడం ఇదే తొలిసారి.