IPL 2024: ఆ నిర్ణయం ముంబై ఇండియన్స్‌కు మేలే చేస్తుంది: టీమిండియా దిగ్గజం
IPL 2024 - Hardik Pandya: రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇవ్వడంపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడారు. ఈ నిర్ణయం ఆ జట్టుకు ఎలా ప్రయోజనంగా ఉంటుందో వివరించారు.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‍ను చేసింది. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్‍ను తప్పించటంతో ఆ ఫ్రాంచైజీపై విమర్శలు కూడా వచ్చాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి మళ్లీ ముంబైకు తీసుకొచ్చి మరీ హార్దిక్‍ను కెప్టెన్‍ను చేయడంపై హిట్‍మ్యాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా స్పందించారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడం వల్ల ముంబై ఇండియన్స్‌కు ఎలా ప్లస్ అవుతుందో వివరించారు.
కెప్టెన్‍గా రోహిత్‍ను తప్పించి హార్దిక్‍ను నియమించిన ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ సమర్థించారు. సుదీర్ఘ కాలంలో ఇది ఆ జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో చెప్పారు. భవిష్యత్తు గురించి ఆలోచించి ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుందని, దీని వల్ల రోహిత్ శర్మపై కెప్టెన్ భారం ఉండదని గవాస్కర్ తెలిపారు.
కెప్టెన్సీ బాధ్యత లేకపోవటంతో రోహిత్ శర్మకు స్వేచ్ఛగా ఆడే అవకాశం దక్కుతుందని సునీల్ గవాస్కర్ అన్నారు. “హార్దిక్‍కు కెప్టెన్సీ ఇవ్వడం.. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. టాపార్డర్‌లో స్వేచ్ఛగా ఆడేందుకు వారు రోహిత్ శర్మకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా మూడు లేదా ఐదో స్థానంలో రావొచ్చు. దీంతో ఆ జట్టు నిలకడగా 200 పరుగులు చేసేందుకు ఇది సహకరిస్తుంది” అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
ముంబైకు తిరిగొచ్చిన పాండ్యా
2017లో ముంబై ఇండియన్స్ తరఫునే హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్‍లో అడుగుపెట్టాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే, 2022 ఐపీఎల్ కోసం ముంబై అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను తీసుకుంది. 2022 టోర్నీలో కెప్టెన్‍గా గుజరాత్‍కు హార్దిక్ టైటిల్ అందించాడు. 2023 సీజన్‍లో ఆ జట్టు ఫైనల్‍కు వెళ్లి రన్నరప్‍గా నిలిచింది. ఇక, ఐపీఎల్ 2024 సీజన్ కోసం గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. మళ్లీ జట్టులోకి తెచ్చుకుంది.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల మాట్లాడారు. దీని వల్ల రోహిత్ శర్మపై కెప్టెన్సీ భారం తగ్గి.. అతడి అత్యుత్తమ ఆట బయటికి వచ్చే అవకాశం ఉంటుందని అతడు చెప్పాడు. “అతడు ఇంకా ప్లేయర్‌గా ఉండాలని మేం అనుకుంటున్నాం. కెప్టెన్‍గా అనే హైప్ లేకుండా బరిలోకి దిగి అతడు బ్యాటింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. గత రెండు సీజన్లు బ్యాటింగ్ విషయంలో అతడికి అత్యుత్తమంగా లేవు” అని బౌచర్ చెప్పారు.
అయితే, మార్క్ బౌచర్ వ్యాఖ్యలపై రోహిత్ భార్య రితికా సజ్దేశ్ కామెంట్ చేశారు. అందులో చాలా తప్పులు ఉన్నాయంటూ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22న మొదలవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో.. అంతకు ముందే జరిగే ఐపీఎల్ కీలకంగా ఉండనుంది.