MS Dhoni Bat: ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ.. అతని బ్యాట్‌పైనే అందరి కళ్లూ.. ఎందుకో తెలుసా?
MS Dhoni Bat: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే నెట్స్ లో అందరి కళ్లూ అతని బ్యాట్ పైనే ఉన్నాయి. ఈ బ్యాట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా?

MS Dhoni Bat: మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ 42 ఏళ్ల వయసులో ఇప్పుడు మరో ఐపీఎల్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే అతడు ఐపీఎల్ 2024 కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే ఈ ప్రాక్టీస్ కోసం ధోనీ వాడుతున్న బ్యాట్ పై అతని చిన్ననాటి స్నేహితుడి షాప్ పేరు ఉన్న స్టిక్కర్ ఉండటం విశేషం. దీంతో ఈ బ్యాట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ధోనీ బ్యాట్‌పై ప్రైమ్ స్పోర్ట్స్
ఎమ్మెస్ ధోనీ బ్యాట్ పై ప్రైమ్ స్పోర్ట్స్ అని రాసి ఉన్న స్టిక్కర్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అని ఆలోచిస్తుంటే.. అది ధోనీ చిన్ననాటి స్నేహితుడికి చెందిన షాప్ పేరు అని తేలింది. ధోనీ తనదైన స్టైల్లో సైలెంట్ గా ఇలా తన ఫ్రెండ్ షాపును ప్రమోట్ చేస్తున్నాడని ఈ బ్యాట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ధోనీ తాను ఈస్థాయిలో ఉండటానికి చిన్ననాటి స్నేహితులు చేసిన సాయమే కారణమని చాలాసార్లు చెప్పాడు. అతనిపై రూపొందించిన బయోపిక్ లోనూ ధోనీ ఫ్రెండ్, అతని షాపు గురించి ప్రత్యేకంగా చూపించారు. తన కెరీర్లో ధోనీ బ్యాటుపైకి ఓ స్పాన్సర్ తీసుకొచ్చిన వ్యక్తికి చెందినదే ఈ దుకాణం. ఆ స్నేహితుడి పేరు పరమ్‌జీత్ సింగ్. అతడు రాంచీలో ధోనీకి చాలా మంచి ఫ్రెండ్.
ధోనీ.. 2019 వరల్డ్ కప్‌లోనూ ఇలాగే..
తన కెరీర్లో తనకు సాయం చేసిన వారిని ధోనీ ప్రమోట్ చేయడం ఇదే కొత్త కాదు. 2019 వరల్డ్ కప్ సమయంలోనూ అతడు ఇలాగే చేశాడు. ఆ టోర్నీలో ధోనీ వివిధ లోగోలు ఉన్న బ్యాట్లతో బరిలోకి దిగాడు. అప్పట్లో అతడు ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ మరుసటి ఏడాది రిటైరైన తర్వాతగానీ తన చివరి టోర్నమెంట్లో ధోనీ తన బ్యాట్ స్పాన్సర్లందరికీ ఇలా థ్యాంక్స్ చెప్పాడని తెలిసింది.
నిజానికి ఆ టోర్నీలో అతడు అలా వివిధ బ్యాట్లతో ఆడటం సరికాదని మొదట్లో స్పాన్సర్లు భయపడ్డారు. కానీ తర్వాత దాని ద్వారా వచ్చిన పబ్లిసిటీ కూడా తమకు మేలు చేస్తుందని భావించారు. ఓ క్రికెటర్ కెరీర్లో సాయం చేసిన స్పాన్సర్లందరికీ థ్యాంక్స్ చెప్పడం కూడా ముఖ్యమే అని ధోనీ ఇలా నిరూపించాడు.
ధోనీ ఫిట్‌నెస్
గతేడాది ఐపీఎల్లో మోకాలి గాయంతోనే ధోనీ ఆడాడు. లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరో టైటిల్ సాధించి పెట్టిన తర్వాత ధోనీ తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు.. ఐపీఎల్ 2024లో మరోసారి సీఎస్కేకు కెప్టెన్సీ చేపట్టడానికి రెడీ అవుతున్నాడు.
గత మూడేళ్లుగా ధోనీ ఆడబోయే చివరి ఐపీఎల్ సీజన్ ఇదే అంటూ ప్రతిసారీ వార్తలు రావడం.. అతడు మాత్రం తన నోటి నుంచే నేరుగా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఒక్కో సీజన్ ఆడుతూ వెళ్లడం జరుగుతూనే ఉంది.