IND vs AUS 2024: పెర్త్‌లో అడుగుపెట్టిన రిషబ్ పంత్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ హిట్టర్ రికార్డుతో కంగారూల్లో గుబులు
12 November 2024, 17:46 IST
Rishabh Pant Records In Australia: భారత్ జట్టులో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ రిషబ్ పంత్ అని ఆస్ట్రేలియా టీమ్‌ని ఆ దేశ మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. అలా ఎందుకు వార్న్ చేస్తున్నారంటే..?
రిషబ్ పంత్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా గడ్డపైకి భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ టీమ్ కంటే ముందే వెళ్లాడు. నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ ముంగిట అక్కడి పరిస్థితుల్ని అలవాటు చేసుకోవడానికి రిషబ్ పంత్ ముందే వెళ్లాడు.
పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానానికి వెళ్లిన రిషబ్ పంత్.. అక్కడ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
పంత్ ఆడింది 7 టెస్టులే.. కానీ?
ఆస్ట్రేలియా గడ్డపై రిషబ్ పంత్‌కి మంచి రికార్డు ఉంది. ఆసీస్ గడ్డపై ఇప్పటి వరకు పంత్ ఆడిన ఏడు టెస్టులకిగానూ.. 12 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 62.40 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు, రెండు అర్ధసెంచరీలు కూడా ఉండగా.. ఆ గడ్డపై పంత్ అత్యుత్తమ స్కోరు 159 పరుగులు.
2020-21లో టెస్టు సిరీస్ కోసం పంత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం అతని టెస్టు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. మూడు టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు చేసిన పంత్.. టాప్ స్కోరర్‌లలో ఒకడిగా నిలిచాడు. మరీ ముఖ్యంగా.. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో 407 పరుగుల లక్ష్య ఛేదనకి భారత్ జట్టు దిగింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టం.. అలానే పిచ్ బౌలర్లకి అనుకూలించడంతో భారత్ ఓటమి తప్పని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ.. పంత్ వీరోచితంగా పోరాడి 97 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
గబ్బా హీరోగా పంత్
బ్రిస్బేన్‌లో 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 89 పరుగులు చేసి భారత్ జట్టుని పంత్ గెలిపించాడు. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో 32 ఏళ్లకు పైగా ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని తన ఇన్నింగ్స్‌తో పంత్ తెరదించాడు.
ఇటీవల బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో పంత్ 10 ఇన్నింగ్స్‌లో 46.88 సగటుతో 422 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. కానీ.. బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కి గురైంది. దాంతో ఇప్పుడు భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపైనే 4-0తో తప్పక ఓడించాల్సిన పరిస్థితి.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కి భారత్ టెస్టు జట్టు
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
భారత్‌తో తొలి టెస్టుకి ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, నాథన్ , స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.