Gautam Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌ని ఇరుకునపడేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఫైనల్ ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ?-head coach gautam gambhir reportedly could be demoted to india white ball coach ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gautam Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌ని ఇరుకునపడేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఫైనల్ ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ?

Gautam Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌ని ఇరుకునపడేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఫైనల్ ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ?

Galeti Rajendra HT Telugu
Nov 09, 2024 04:04 PM IST

Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్‌ ముంగిట బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడని రోహిత్ చెప్పినట్లు తెలుస్తోంది.

गौतम गंभीर
गौतम गंभीर (PTI)

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇరుకునపడేశాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు 0-3తో వైట్‌వాష్‌కి గురైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (భీసీసీఐ) తాజాగా ముంబయిలోన రివ్యూ మీటింగ్ నిర్వహించింది. అలానే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ ఫిర్యాదు

బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా హాజరయ్యారు. ఈ సమావేశంలో గౌతమ్ గంభీర్‌పై పలు ఫిర్యాదులు చేసిన రోహిత్ శర్మ.. ఆఖరి టెస్టుకి ముంబయి పిచ్‌ను గంభీర్ మార్పించడంపై కూడా సమావేశంలో మండిపడినట్లు తెలుస్తోంది.

జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇప్పటికే పలు వార్తలు వెలువడగా.. ఆస్ట్రేలియా టూర్‌కి జట్టుని కూడా గంభీర్‌కి నచ్చినట్లే ఎంపిక చేశాడని ఆరోపణలు వినిపించాయి. దాంతో జట్టు ఎంపికపై ఇప్పటికే గుర్రుగా ఉన్న రోహిత్ శర్మ.. గంభీర్‌పై అవకాశం రాగానే కోచింగ్ శైలితో పాటు అన్ని విషయాల్ని రివ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది.

కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు వస్తే?

సాధారణంగా టీమ్ కెప్టెన్, హెడ్ కోచ్ ఒకే పేజీలో ఉండాలి. ఒకవేళ అభిప్రాయ భేదాలు ఏర్పడితే అది టీమ్ మనుగడకే ప్రమాదం. కాబట్టి.. గౌతమ్ గంభీర్‌ను కాస్త హెచ్చరించిన బీసీసీఐ పెద్దలు.. ఆస్ట్రేలియా టూర్‌ రూపంలో ఆఖరి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

భారత్ జట్టు నవంబరు 22 నుంచి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులను ఆడనుంది. ఈ సిరీస్‌లో కనీసం నాలుగు టెస్టులను భారత్ జట్టు గెలిస్తేనే.. ఐసీసీ టెస్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. అలానే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. ఫైనల్ బెర్తు దక్కడం అనుమానమే. ఐదింట్లో నాలుగు గెలవాలి.. మిగిలిన ఒక టెస్టులో కనీసం డ్రా అయినా చేసుకోవాలి తప్ప.. ఓడిపోకూడదు.

ఆస్ట్రేలియా టూర్‌లో ఫెయిలైతే?

ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు విఫలమైతే.. గౌతమ్ గంభీర్‌ను తొలుత టీమ్ వన్డే, టీ20 కోచింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తామని హెచ్చరించినట్లు తెస్తోంది. దైనిక్ జాగరణ్ నివేదిక ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ జట్టు విఫలమైతే వన్డే, టీ20 కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందట. టెస్టులకి మాత్రం గౌతమ్ గంభీర్‌ను కొన్నాళ్లు కొనసాగించి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆప్షన్‌గా వీవీఎస్‌

గౌతమ్ గంభీర్ అందుబాటులో లేని సమయాల్లో లేదా విశ్రాంతి అవసరమైనప్పుడు భారత టీ20 జట్టుకి కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. అతని పర్యవేక్షణలో భారత టీ20 జట్టు వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లోనూ భారత్ జట్టు సమష్టిగా రాణించి అలవోక విజయాన్ని అందుకుంది.

Whats_app_banner