తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul Out Controversy: వివాదంతో మొదలైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. అంపైర్‌ను తిట్టుకుంటూ వెళ్లిన కేఎల్ రాహుల్

KL Rahul Out Controversy: వివాదంతో మొదలైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. అంపైర్‌ను తిట్టుకుంటూ వెళ్లిన కేఎల్ రాహుల్

Galeti Rajendra HT Telugu

22 November 2024, 12:02 IST

google News
  • IND vs AUS 1st Test: కేఎల్ రాహుల్ బ్యాట్‌కి అత్యంత సమీపంలో బంతి వెళ్లిన మాట వాస్తవమే.. కానీ బ్యాట్‌కి మాత్రం  బంతి తాకలేదు. దాంతో ఫీల్డ్ అంపైర్ కూడా తొలుత ఔట్ ఇవ్వలేదు. కానీ..? 

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (X)

కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ వివాదంతో శుక్రవారం మొదలైంది. పెర్త్ వేదికగా ఈరోజు మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. వరుసగా వికెట్లు చేజార్చుకుంటోంది. అయితే.. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను అంపైర్ ఔట్ ఇచ్చిన తీరు వివాదాస్పదంగా మారింది.

అందరూ ఔటైనా.. నిలిచిన రాహుల్

ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తున్న పెర్త్ పిచ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0), విరాట్ కోహ్లీ (5), ధ్రువ్ జురెల్ (11) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో పట్టుదలతో క్రీజులో నిలిచిన కేఎల్ రాహుల్ 22 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. అయితే.. ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వివాదాస్పద రీతిలో కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు.

సౌండ్‌ని నమ్మి ఆసీస్ రివ్యూ

మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్ అవల విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అత్యంత సమీపంలో వెళ్లిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దాంతో క్యాచ్ ఔట్ కోసం ఆస్ట్రేలియా టీమ్ అప్పీల్ చేయగా.. బంతి బ్యాట్‌కి తాకలేదని భావించిన ఫీల్డ్ అంపైర్.. ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు. కానీ.. బంతి బ్యాట్ పక్క నుంచే వెళ్లే క్రమంలో ఒక చిన్న శబ్ధం రావడంతో.. ఆస్ట్రేలియా సాహసోపేతంగా రివ్యూకి వెళ్లింది.

ఫ్రంట్ యాంగిల్ చూడకుండా.. ఔట్

రిప్లేని పరిశీలించిన థర్డ్ అంపైర్.. ఫ్రంట్ యాంగిల్‌ను ఏమాత్రం పరిశీలించకుండా కేవలం స్నికో స్పైక్‌ను మాత్రమే పరిశీలించాడు. దాంతో బ్యాట్ బంతి పక్క నుంచి వెళ్లే సమయంలోనే శబ్ధం వచ్చినట్లు నిర్ధారించి.. ఫీల్డ్ అంపైర్‌ను తన నాటౌట్ నిర్ణయాన్ని మార్చుకోమని సూచించాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ కూడా తొలుత ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత చేసేది ఏమీ లేక.. ఔట్ ఇచ్చాడు.

తిట్టుకుంటూ వెళ్లిన కేఎల్ రాహుల్

వాస్తవానికి బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లే సమయంలో వచ్చిన శబ్ధం.. బంతి బ్యాట్‌కి తాకడంతో వచ్చింది కాదు. అదే సమయంలో బ్యాట్.. కేఎల్ రాహుల్ ప్యాడ్‌ను తాకడంతో వచ్చింది. ఒకవేళ థర్డ్ అంపైర్.. ఫ్రంట్ యాంగిల్‌లో ఆ రీప్లేను పరిశీలించి ఉంటే.. నిజం తెలిసేది. తొలి సెషన్ ముగిసిన తర్వాత ఈ వీడియో మొత్తం బయటికి వచ్చింది. బంతి బ్యాట్‌కి తాకకపోయినా.. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఫీల్డర్లు అతిగా సంబరాలు చేసుకోగా.. కేఎల్ రాహుల్ అసహనంగా అంపైర్‌ను తిట్టుకుంటూనే పెవిలియన్ వైపు నడిచాడు.

ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. గత రెండు సార్లు వరుసగా ఈ ట్రోఫీని భారత్ గెలవగా.. ప్రతిసారీ ఏదో ఒక వివాదం సిరీస్‌లో వెంటాడుతూనే ఉంటుంది. అయితే.. ఈసారి సిరీస్ మొదటి రోజే.. అదీ తొలి సెషన్‌లోనే మొదలవడం గమనార్హం.

తదుపరి వ్యాసం