Virat Kohli Batting: పెర్త్‌లో వర్షం కురుస్తున్నా విరాట్ కోహ్లీ బ్యాటింగ్, పరుగులు తీసిన మిగిలిన క్రికెటర్లు-team india batter virat kohli refuses to leave nets continues to bat even as rain halts ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Batting: పెర్త్‌లో వర్షం కురుస్తున్నా విరాట్ కోహ్లీ బ్యాటింగ్, పరుగులు తీసిన మిగిలిన క్రికెటర్లు

Virat Kohli Batting: పెర్త్‌లో వర్షం కురుస్తున్నా విరాట్ కోహ్లీ బ్యాటింగ్, పరుగులు తీసిన మిగిలిన క్రికెటర్లు

Galeti Rajendra HT Telugu

IND vs AUS 1st Test: విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే.. ఆస్ట్రేలియా టూర్‌లో సత్తాచాటాలని ఆశిస్తున్న కోహ్లీ.. వర్షంలోనూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

విరాట్ కోహ్లీ (AFP)

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత పట్టుదలతో బ్యాటింగ్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో నవంబరు 22 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.

ఈ వారంలోనే పెర్త్ టెస్టు

పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవైపు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే.. మరోవైపు వార్మప్ కోసం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు వేగంగా తప్పిదాలు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు.

కోహ్లీ బ్యాటింగ్.. మొదలైన వర్షం

పెర్త్‌లో విరాట్ కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఒక్కసారిగా వర్షం మొదలైంది. దాంతో నెట్స్‌లోని బ్యాటర్లందరూ తమ కిట్ తీసుకుని పరుగులు తీశారు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం వర్షంలోనూ అలానే కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడట. దాంతో ఆశ్చర్యపోవడం భారత క్రికెటర్ల వంతైందని వార్తలు వస్తున్నాయి.

టీమిండియాలో టెన్షన్

వర్షం క్రమంగా పెరగడంతో కోహ్లీ గాయపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందిన టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్‌ను వెంటనే ఆపేయమని హెచ్చరించిందట. దాంతో కోహ్లీ కూడా ప్రాక్టీస్ ఆపేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే భారత్ జట్టులో శుభమన్ గిల్ గాయపడగా.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ గాయాల నుంచి కోలుకున్నారు. కోహ్లీకి కూడా గాయమవడంతో.. స్కానింగ్‌కి వెళ్లొచ్చాడు. అయితే.. గాయం తీవ్రత తక్కువగా ఉండటంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

ఓపెనర్లుగా ఎవరెవరు?

పెర్త్ టెస్టుకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవగా.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. యశస్వి జైశ్వాల్ మరో ఓపెనర్. అయితే.. విరాట్ కోహ్లీని నెం.3లో ఆడించాలని గౌతమ్ గంభీర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్?

సాధారణంగా టెస్టుల్లో కోహ్లీ నెం.4లో ఆడుతుంటాడు. కానీ.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వెళితే.. మిడిలార్డర్‌లో దేవదత్ పడిక్కల్‌ను ఆడించాలని గంభీర్ యోచిస్తున్నాడు. పడిక్కల్‌కి నెం.4లో ఆడిన అనుభవం ఉండటం.. ఇటీవల ఆస్ట్రేలియా- ఎ జట్టుపై అక్కడే నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 36, 88, 26, 1 పరుగులు చేసి ఉండటంతో అతడ్ని ఆడించాలని గంభీర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.