తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wtc Final: న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌తో భారత్‌కి చేజారిన నెం.1 ర్యాంక్, ప్రమాదంలో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు

WTC Final: న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌తో భారత్‌కి చేజారిన నెం.1 ర్యాంక్, ప్రమాదంలో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు

Galeti Rajendra HT Telugu

03 November 2024, 16:45 IST

google News
  • WTC Points Table: న్యూజిలాండ్ చేతిలో వరుసగా 3 టెస్టుల్లో ఓడిపోయిన భారత్ జట్టు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ నెం.1 స్థానాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు ఫైనల్‌ బెర్తుని భారత్ దక్కించుకోవాలంటే? 

చేజారిన నెం.1 ర్యాంక్
చేజారిన నెం.1 ర్యాంక్ (AFP)

చేజారిన నెం.1 ర్యాంక్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ బెర్తుని సులువుగా దక్కించుకునేలా కనిపించిన టీమిండియా.. అనూహ్యరీతిలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కి గురై ఇబ్బందుల్లో పడింది. ముంబయిలోని వాంఖడే వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టులో 25 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయిన భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌ని 0-3తో చేజార్చుకున్న విషయం తెలిసిందే.

రెండో స్థానానికి దిగజారిన భారత్

ఈ వైట్‌వాష్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ భారత్ జట్టు తన నెం.1 స్థానాన్ని కోల్పోయింది. వాంఖడే టెస్టు ఓటమితో భారత్ జట్టు 58.33% పాయింట్లకి పడిపోగా.. ఇప్పటికే 62.5% పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా నెం.1 స్థానానికి ఎగబాకింది. ఇక భారత్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ టీమ్ పాయింట్ల పట్టికలో ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కి భారత్ చేరాలంటే నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాలి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులను టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడిపోయినా.. భారత్ జట్టు ఫైనల్‌కి అర్హత సాధించడం కష్టం అవుతుంది.

ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి.. ఒక మ్యాచ్‌ని డ్రాగా ముగించుకున్నా ఫైనల్‌ చేరేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ.. ఒక్క టెస్టులో కూడా ఓడిపోకూడదు. ఒకవేళ ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టుల్లో గెలిచి, ఒక టెస్టులో ఓడిపోతే భారత్ జట్టుకి గరిష్టంగా 64.03% పాయింట్లు వస్తాయి. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్‌కి చేరాలంటే.. భారత్‌‌పై సిరీస్‌ని కనీసం 3-2తో గెలవాల్సిందే.

రేసులోకి హఠాత్తుగా దక్షిణాఫ్రికా

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఆస్ట్రేలియా మొత్తం 7 టెస్టులను ఆడనుండగా.. ఇందులో భారత్‌తో 5, శ్రీలంకతో రెండు మ్యాచ్‌లను ఆడనుంది. ఓవరాల్‌గా ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది.

దక్షిణాఫ్రికా టీమ్ హఠాత్తుగా ఫైనల్ రేసులోకి వచ్చింది. ఆ జట్టు ప్రస్తుతం 54.16 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిస్తే ఫైనల్ రేసులో ఉండనుంది. ఆ నాలుగు మ్యాచ్‌లను కూడా శ్రీలంక, పాకిస్థాన్‌తో అది కూడా సొంతగడ్డపై ఆడనుండటం దక్షిణాఫ్రికా టీమ్‌కి కలిసొచ్చే అంశం.

భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. మూడు టెస్టులను ఇంగ్లాండ్‌తో ఆడనుండగా.. ఈ మూడింటిలోనూ గెలిస్తే కివీస్ కూడా ఫైనల్ రేసులో ఉండనుంది.

తదుపరి వ్యాసం