IND vs NZ 3rd Test Highlights: వాంఖడేలోనూ ఓడిన భారత్.. 24 ఏళ్ల తర్వాత టీమిండియాకి వైట్‌వాష్ రుచి చూపిన న్యూజిలాండ్
India vs New Zealand 3rd Test: సొంతగడ్డపై టీమిండియాకి ఘోర పరాభవం ఎదురైంది. వాంఖడే పిచ్‌పై కేవలం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఈరోజు న్యూజిలాండ్ టీమ్ ముందు తలొంచింది. గత రెండు దశాబ్దాల్లో భారత్‌కి ఇదే అత్యంత చెత్త ఓటమి.
భారత్ గడ్డపై రెండు దశాబ్దాల తర్వాత టీమిండియాకి టెస్టుల్లో వైట్‌వాష్ ఎదురైంది. న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో కేవలం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు ఛేదించలేక 121 పరుగులకే చతికిలపడింది. దాంతో 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ టీమ్.. మూడు టెస్టుల సిరీస్‌ని కూడా 3-0తో చేజిక్కించుకుంది.
24 ఏళ్ల తర్వాత మళ్లీ వైట్‌వాష్
భారత్ గడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారికాగా.. 2000 సంవత్సరం తర్వాత తొలిసారి టీమిండియా సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ని చవిచూసింది. అప్పట్లో దక్షిణాఫ్రికా టీమ్ 2-0తో భారత్‌పై గెలిచింది.
మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 171/9తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ టీమ్ మరో 3 పరుగులు జోడించి 174 పరుగులకే ఆలౌటైంది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కి లభించిన 28 పరుగుల ఆధిక్యాన్ని తీసేస్తే.. కేవలం 147 పరుగుల టార్గెట్ మాత్రమే టీమిండియా ముందు నిలిచింది. కానీ.. స్పిన్‌కి అతిగా అనుకూలించిన వాంఖడే పిచ్‌లో ఈ స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేకపోయింది.
రిషబ్ పంత్ ఒక్కడే
ఛేదన ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (11), యశస్వి జైశ్వాల్ (5), శుభమన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (1), సర్ఫరాజ్ ఖాన్ వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. దాంతో ఒకానొక దశలో 29/5తో నిలిచిన టీమిండియా కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ.. రవీంద్ర జడేజా (6), వాషింగ్టన్ సుందర్ (12)తో కలిసి రిషబ్ పంత్ (64: 57 బంతుల్లో 9x4, 1x6) అసాధారణరీతిలో పోరాడాడు.
కానీ.. టీమ్ స్కోరు 106 వద్ద రిషబ్ పంత్ ఏడో వికెట్‌గా ఔట్ అవ్వడంతో భారత్ జట్టుకి ఓటమి ఖాయమైపోయింది. ఆఖర్లో అశ్విన్ (8), ఆకాశ్ దీప్ (0), మహ్మద్ సిరాజ్ (0 నాటౌట్) ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయారు. ఆఖరి వరకూ క్రీజులో ఉన్న వాషింగ్టన్ సుందర్ కూడా చేతులెత్తేయడంతో భారత్ జట్టుకి అవమానకర ఓటమి తప్పలేదు.
పతనాన్ని శాసించిన అజాజ్
న్యూజిలాండ్ జట్టులో ఈరోజు స్పిన్నర్ అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మరో స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో 3 ఓవర్లు మినహా దాదాపు 26 ఓవర్లని ఈ ఇద్దరే వేస్తూ భారత్ బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగిస్తూ వచ్చారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేయగా.. భారత్ జట్టు 263 పరుగులు చేసింది. దాంతో 28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ 174 పరుగులే చేయగా.. ఛేదనలో టీమిండియా 121 పరుగులకే కుప్పకూలిపోయింది.
36 ఏళ్లుగా ఓటమి.. ఇప్పుడు హ్యాట్రిక్ గెలుపు
ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై న్యూజిలాండ్ పర్యటన ముగిసింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. ఆ తర్వాత పుణెలో జరిగిన రెండో టెస్టులోనూ 113 పరుగుల తేడాతో గెలిచింది. తాజాగా 25 పరుగుల తేడాతో గెలవడం ద్వారా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేసింది. గత 36 ఏళ్లుగా టెస్టు మ్యాచ్‌ల్లో వరుసగా భారత్ గడ్డపై ఓడిపోతూ వచ్చిన న్యూజిలాండ్.. ఈసారి వరుసగా 3 టెస్టుల్లోనూ గెలవడం గమనార్హం.