Team India: నాటౌట్.. నాటౌట్.. ఔట్, న్యూజిలాండ్ బ్యాటర్‌‌ వికెట్ కోసం ఫలించిన టీమిండియా ట్రిక్!-masterful r ashwin outfoxes young with carrom ball ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: నాటౌట్.. నాటౌట్.. ఔట్, న్యూజిలాండ్ బ్యాటర్‌‌ వికెట్ కోసం ఫలించిన టీమిండియా ట్రిక్!

Team India: నాటౌట్.. నాటౌట్.. ఔట్, న్యూజిలాండ్ బ్యాటర్‌‌ వికెట్ కోసం ఫలించిన టీమిండియా ట్రిక్!

Galeti Rajendra HT Telugu
Nov 02, 2024 08:36 PM IST

India vs New Zealand 3rd Test: అశ్విన్ ఓవర్‌లో సాధారణంగా ఒక క్యారమ్‌ బాల్‌ను వేస్తుంటాడు. కానీ.. విల్ యంగ్‌ను ఔట్ చేయడానికి సాహసోపేతంగా మూడు బాల్స్ విసిరాడు. భారత్ ఫీల్డర్ల సాయం కూడా అందడంతో అతని ట్రిక్ వర్కవుట్ అయ్యింది.

అశ్విన్‌తో మాట్లాడుతున్న రోహిత్ శర్మ
అశ్విన్‌తో మాట్లాడుతున్న రోహిత్ శర్మ (Surjeet Yadav)

న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు విజయానికి బాటలు వేసుకుంది. మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9తో నిలవగా.. ఆ జట్టు కేవలం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో భారత్ ముందు 150 పరుగులకి ఆటు ఇటుగా లక్ష్యం నిలిచే అవకాశం ఉంది.

క్యారమ్ బాల్స్‌తో ప్లాన్

వాంఖడే టెస్టులో భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకిగా ఉన్న విల్ యంగ్ వికెట్ కోసం టీమిండియా సరికొత్త వ్యూహం రచించింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ 138 బంతుల్లో 71 పరుగులు చేసిన విల్ యంగ్.. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లో కూడా 100 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. దాంతో విల్ యంగ్ వికెట్ కోసం అశ్విన్ పదే పదే క్యారమ్‌ బాల్‌ని ప్రయోగిస్తూ ఇబ్బందిపెట్టగా.. భారత్ ఫీల్డర్లు కూడా ఔట్ కోసం అప్పీల్ చేస్తూ అతని ఏకాగ్రత్తని దెబ్బతీశారు.

ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన అశ్విన్.. ఓవర్‌లో ఏకంగా 3 క్యారమ్ బాల్స్ విసిరాడు. ఇందులో ఒక బంతిని డిఫెన్స్ కోసం విల్ యంగ్ ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్‌ పక్క నుంచి వెళ్లి కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

కావాలనే అప్పీల్

ఇదే ఓవర్‌లో మరో క్యారమ్ బంతిని లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని అశ్విన్ విసిరగా.. ప్లిక్ చేసేందుకు విల్ యంగ్ ప్రయత్నించాడు. అయితే.. మళ్లీ బ్యాట్‌కి దొరకని బంతి థై ప్యాడ్‌ని తాకి గాల్లోకి లేవగా.. కీపర్ రిషబ్ పంత్ డైవ్ చేస్తూ అందుకోబోయాడు. కానీ.. అతని చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అవగా.. పక్కనే ఉన్న సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ పట్టాడు. దాంతో మరోసారి క్యాచ్ ఔట్ అవుట్ కోసం భారత్ అప్పీల్ చేసింది. ఈసారి కూడా ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు.

లాస్ట్‌కి అశ్విన్‌కే క్యాచ్

కానీ.. ఓవర్ చివరి బంతికి విల్ యంగ్ దొరికిపోయాడు. అశ్విన్ విసిరిన క్యారమ్ బాల్‌ని నేరుగా అశ్విన్‌కే సింపుల్‌గా క్యాచ్ ఇచ్చేశాడు. అప్పటికే వరుసగా రెండు క్యాచ్ ఔట్ అప్పీల్‌ళ్లతో విల్ యంగ్ ఏకాగ్రత దెబ్బతిన్నట్లు కనిపించింది. వాస్తవానికి ఈ రెండు సందర్భాల్లోనూ బంతి బ్యాట్‌కి తాకలేదని భారత్ ఫీల్డర్లకి తెలుసు. అందుకే.. డీఆర్‌ఎస్‌కి వెళ్లలేదు. కానీ.. విల్ యంగ్‌పై ఒత్తిడి పెంచడానికి అప్పీల్ చేశారు. మొత్తానికి ఆ ట్రిక్ ఫలించి భారత్‌కి వికెట్ దక్కింది.

Whats_app_banner