IND vs NZ 3rd Test: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ మిస్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా స్వ‌ల్ప ఆధిక్యం-ind vs nz 3rd test team india all out for 263 runs and lead 28 runs against new zealand in first innings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz 3rd Test: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ మిస్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా స్వ‌ల్ప ఆధిక్యం

IND vs NZ 3rd Test: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ మిస్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా స్వ‌ల్ప ఆధిక్యం

Nelki Naresh Kumar HT Telugu
Nov 02, 2024 01:38 PM IST

IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 263 ప‌రుగుల‌కు ఆలౌటైంది. శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ (90 ప‌రుగులు) మిస్ చేసుకోగా...పంత్ (60 ర‌న్స్‌) ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో అద‌ర‌గొట్టాడు.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టెస్ట్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టెస్ట్

IND vs NZ 3rd Test: ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతోన్న మూడో టెస్ట్ నువ్వే నేనా అన్న‌ట్లుగా పోటాపోటీగా సాగుతోంది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 263 పరుగుల‌కు ఆలౌటైంది. న్యూజిలాండ్‌పై 28 ప‌రుగుల స్వ‌ల్ప‌ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న‌ది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 ప‌రుగులు చేసింది.

పంత్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌...

తొలి ఇన్నింగ్స్‌లో 84 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ టీమిండియాను శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 96 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. ముఖ్యంగా రిష‌బ్ పంత్ టీ20 త‌ర‌హాలో రెచ్చిపోయాడు.

కేవ‌లం 36 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ సాధించాడు. న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ చేసిన టీమిండియా క్రికెట‌ర్‌గా ఈ మ్యాచ్ ద్వారా రికార్డ్ నెల‌కొల్పాడు. ధాటిగా ఆడుతోన్న పంత్‌ను ఇష్ సోధి ఔట్ చేశాడు. 59 బాల్స్‌లో ఎనిమిదిఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 60 ప‌రుగులు చేసిన పంత్ పెవిలియ‌న్ చేరుకున్నాడు.

సెంచ‌రీ మిస్‌...

న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన శుభ్‌మ‌న్ గిల్ తృటిలో సెంచ‌రీని మిస్స‌య్యాడు. 90 ప‌రుగులు వ‌ద్ద అజాజ్ ప‌టేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 146 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో గిల్ 90 ర‌న్స్ చేశాడు. స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ డ‌కౌట్ అయ్యి నిరాశ‌ప‌రిచాడు.

చివ‌ర‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ బ్యాట్ ఝులిపించ‌డంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై స్వ‌ల్ప ఆధిక్యం సొంతం చేసుకున్న‌ది. 36 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 38 ప‌రుగుల‌తో వాషింగ్ట‌న్ సుంద‌ర్ నాటౌట్‌గా మిగిలాడు. అత‌డికి టెయిలెండ‌ర్లు ఎవ‌రూ స‌రైన స‌హ‌కారం అందించ‌లేక‌పోయారు.న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో అజాజ్ ప‌టేల్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

సిరీస్ కైవ‌సం

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 ప‌రుగుల‌కే ఆలౌటైంది. డారి మిచెల్( 84 ప‌రుగులు) విల్ యంగ్ (71 ర‌న్స్‌) మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నిరాశ‌ప‌రిచారు. జ‌డేజా ఐదు వికెట్లు తీసుకోగా...సుంద‌ర్‌కు నాలుగు వికెట్లు ద‌క్కాయి. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇప్ప‌టికే 2 -0 తేడాతో న్యూజిలాండ్ కైవ‌సం చేసుకున్న‌ది.

Whats_app_banner