Ashwin Stunning Catch: : వాంఖడే టెస్టులో అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్-ravichandran ashwin takes a stunning sideways running catch to send daryl mitchell back ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin Stunning Catch: : వాంఖడే టెస్టులో అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్

Ashwin Stunning Catch: : వాంఖడే టెస్టులో అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్

Galeti Rajendra HT Telugu
Nov 02, 2024 04:48 PM IST

IND vs NZ 3rd Test: అశ్విన్ తలపై నుంచి సిక్స్ కొట్టాలని న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్ భారీ షాట్ ఆడాడు. కానీ.. రవీంద్ర జడేజా తెలివిగా బంతి వేగం తగ్గించడంతో అశ్విన్ వెనుక వైపు బంతి గాల్లోకి లేచింది.

క్యాచ్ పట్టిన ఆనందంలో అశ్విన్
క్యాచ్ పట్టిన ఆనందంలో అశ్విన్ (AFP)

న్యూజిలాండ్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు వేసి కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన అశ్విన్.. బ్యాటింగ్‌‌లో కూడా 13 బంతులాడి 6 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే.. ఫీల్డింగ్‌లో మాత్రం అశ్విన్ అదరగొట్టేశాడు.

షాట్‌కి ఆహ్వానించి స్పీడ్ తగ్గించిన జడేజా

మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో డార్లీ మిచెల్ (21: 44 బంతుల్లో 1x4, 1x6) నిలకడగా ఆడుతూ కనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ 129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసిన డార్లీ మిచెల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే టీమిండియాకి ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ.. రవీంద్ర జడేజా తెలివిగా డార్లీ మిచెల్‌ని భారీ షాట్ కోసం ఆహ్వానించగా బౌండరీ లైన్‌కి సమీపంలో అశ్విన్ వెనక్కి డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

నోరెళ్లబెట్టిన డార్లీ మిచెల్

ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన రవీంద్ర జడేజా ఊరిస్తూ విసిరిన బంతిని క్రీజు వెలుపలికి వచ్చి మరీ భారీ షాట్ ఆడేందుకు డార్లీ మిచెల్ ప్రయత్నించాడు. అయితే.. జడేజా తెలివిగా బంతి వేగం తగ్గించడంతో డార్లీ మిచెల్ ఆశించినట్లు బంతిని కనెక్ట్ చేసినా అది మిడాన్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. అశ్విన్ క్యాచ్ పట్టిన తీరుని నమ్మలేనట్లు నోరెళ్లబెట్టిన డార్లీ మిచెల్.. నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

డైవ్ చేయని అశ్విన్ సాహసం

వాస్తవానికి గాయాల కారణంగా అశ్విన్ మైదానంలో డైవ్ చేయడానికి సాహసించడు. బ్యాటింగ్ సమయంలో రనౌట్ ప్రమాదం ఎదురైనప్పుడు క్రీజులోకి రావడానికి అతను డైవ్ చేయడం చాలా అరుదు. ఇక ఫీల్డింగ్‌లోనూ అంతే. కానీ.. వాంఖడేలో మాత్రం అశ్విన్ సాహసించాడు. దాంతో మిగిలిన భారత్ ఆటగాళ్ల నుంచి అతనికి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి.

రెండో ఇన్నింగ్స్‌లో ఈరోజు 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టగా.. న్యూజిలాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 168/8తో కొనసాగుతోంది. ఆ జట్టు కేవలం 140 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భారత్ ముందు 200లోపు లక్ష్యం నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

Whats_app_banner