IND vs NZ 3rd Test Highlights: ఆలౌట్ ముంగిట న్యూజిలాండ్, రెండో రోజే భారత్ చేతుల్లోకి వచ్చేసిన మ్యాచ్
Wankhede Test Highlights: వాంఖడే టెస్టులో భారత్ జట్టు విజయానికి బాటలు వేసుకుంది. పర్యాటక జట్టు న్యూజిలాండ్‌పై వరుసగా రెండో రోజు ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. మ్యాచ్‌లో తిరుగులేని పొజిషన్‌కి చేరుకుంది.
న్యూజిలాండ్ చేతిలో వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో ఓడిపోయిన భారత్ జట్టు.. వాంఖడే టెస్టులో మాత్రం రెండో రోజే విజయానికి బాటలు వేసుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9తో నిలవగా.. ఆ జట్టు కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. దాంతో ఆదివారం ఆరంభంలోనే ఆ ఒక్క వికెట్‌ని టీమిండియా పడగొట్టగలిగితే.. 150లోపే టార్గెట్ ముందు నిలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి 28 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే.
సిరీస్‌లో ఫస్ట్ టైమ్ ఆధిక్యం
ఈరోజు 86/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టులో శుభమన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అయితే మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకి ఆలౌటైంది. శుక్రవారం న్యూజిలాండ్ టీమ్ 235 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌటై ఉండటంతో.. భారత్ జట్టుకి 28 పరుగుల ఆధిక్యం లభించింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టుకి ఇలా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించడం ఇదే తొలిసారి.
విల్ యంగ్ ఒక్కడే..
28 పరుగుల లోటుతో మధ్యాహ్నం నుంచి రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. భారత్ స్పిన్నర్లు జడేజా (4/52), అశ్విన్ (3/63) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టగా.. ఈ ఇద్దరికీ వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ నుంచి ఒక్కో వికెట్‌తో సపోర్ట్ లభించింది. కానీ.. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్ టీమ్‌లో విల్ యంగ్ (51) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
ఇంకో వికెట్ అడ్డు
ఈరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో అజాజ్ పటేల్ (7 బ్యాటింగ్) ఉండగా.. విలియమ్ ఓరూర్కే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అతను క్రీజులోకి రాకముందే ఆటని అంపైర్లు నిలిపివేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఎవరూ క్రీజులో లేకపోవడంతో ఆదివారం తొలి సెషన్ ఆరంభంలోనే న్యూజిలాండ్‌ను భారత్ జట్టు ఆలౌట్ చేసే అవకాశం ఉంది.
ఆదివారం భారత్‌కి అసలు సవాల్
వాంఖడే పిచ్ శుక్రవారంతో పోలిస్తే శనివారం మరీ అతిగా స్పిన్నర్లకి అనుకూలిస్తూ కనిపించింది. అశ్విన్, జడేజా విసిరిన కొన్ని బంతులు అనూహ్యంగా లో-బౌన్స్ అవుతూ కనిపించాయి. అలానే ఊహించని టర్న్ కూడా లభించింది. ఇక ఆదివారం కూడా స్పిన్నర్లకి పిచ్ కలిసొచ్చే అవకాశాలు లేకపోలేదు. దాంతో 150 పరుగుల టార్గెట్ అయినా.. ఈ పిచ్‌పై ఛేదించడం అంత సులువు కాదు. మరీ ముఖ్యంగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్న వేళ టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆచితూచి ఆడితేనే మ్యాచ్‌ని గెలవచ్చు.