Team India Controversy: టీమిండియాలో విభేదాలు తెరపైకి.. రెండు వర్గాలుగా విడిపోయిన భారత్ జట్టు?
Gautam Gambhir: గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మధ్య విభేదాలు వచ్చినట్లు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టుకి జట్టు ఎంపికలో మొదలైన భేదాభిప్రాయాలు చివరికి పతాక స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో ఫైనల్ టెస్టు మంగిట భారత్ జట్టులో విభేదాలు వచ్చినట్లు ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా శుక్రవారం (నవంబరు 1) నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కి తుది జట్టు ఎంపిక గురించి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
గంభీర్‌ని విభేదించిన రోహిత్
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. దాంతో 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై పర్యాటక జట్టుకి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న భారత్ జట్టు తీవ్ర అవమానాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వాంఖడే టెస్టుకి తుది జట్టుని సమూలంగా మార్చాలని గౌతమ్ గంభీర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోగా.. రోహిత్ శర్మ అడ్డుపడినట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన భారత్ జట్టు మంచి లయతో కనిపించింది. ఆ టోర్నీతో టీ20లకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. అయితే ఈ రెండు ఫార్మాట్లలోనూ భారత్ జట్టుకి ఇటీవల చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన కూడా మరీ తీసికట్టుగా మారిపోయింది.
సీనియర్లపై ఇప్పటికే వేటు
ఇప్పటికే కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి సీనియర్ ప్లేయర్లపై వేటు వేసిన గంభీర్.. విరాట్ కోహ్లీ గురించి కూడా కఠిన నిర్ణయం తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టీమ్‌లోని సీనియర్ ప్లేయర్లకి అండగా నిలుస్తూ గంభీర్‌తో విభేదించినట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మకి అండగా టెస్టు జట్టులోని సీనియర్ ప్లేయర్లు నిలవగా.. గౌతమ్ గంభీర్ వెనుక జూనియర్ ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో రెండుగా విడిపోయిన జట్టు వాంఖడే టెస్టులో ఎలా ఆడుతుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. గతంలో మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు ఈ తరహా విభేదాలు టీమ్‌లో వచ్చాయి.
ఏకపక్ష నిర్ణయాలతో రోహిత్‌కి కోపం
కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చని అనేక నిర్ణయాల్ని ఏకపక్షంగా గౌతమ్ గంభీర్ తీసుకుంటున్నాడట. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు వారిద్దరి మధ్య చర్చలు కూడా నడిచాయని సమాచారం. అయినప్పటికీ గంభీర్ కోచ్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో రోహిత్ శర్మ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది.
2011 వన్డే ప్రపంచకప్ టీమ్ తరహాలో జట్టుని సిద్ధం చేయాలని భావిస్తున్న గౌతమ్ గంభీర్.. సీనియర్ ప్లేయర్లకి ఫామ్ అందుకోవాలని లేదంటే వేటుకి సిద్ధమవ్వాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దాంతో రోహిత్ శర్మ కూడా స్వేచ్ఛగా నిర్ణయాల్ని తీసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
పొంచి ఉన్న వైట్‌వాష్ ప్రమాదం
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్ జట్టు.. ఆ తర్వాత పుణెలో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనకబడగా.. ఆఖరి టెస్టులోనైనా గెలిచి వైట్‌వాష్ పరాభవాన్ని తప్పించుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. భారత్ గడ్డపై టీమిండియా చివరిగా 2000లో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కి గురైంది.