IND vs NZ: భారత్‌తో ఆఖరి టెస్టుకీ హ్యాండిచ్చిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, లక్కీ ఛాన్స్ మిస్-new zealand batter kane williamson ruled out of final test against india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz: భారత్‌తో ఆఖరి టెస్టుకీ హ్యాండిచ్చిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, లక్కీ ఛాన్స్ మిస్

IND vs NZ: భారత్‌తో ఆఖరి టెస్టుకీ హ్యాండిచ్చిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, లక్కీ ఛాన్స్ మిస్

Galeti Rajendra HT Telugu

IND vs NZ 3rd Test: భారత్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ని న్యూజిలాండ్ గెలిచింది. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకి దూరంగా ఉన్న కేన్.. ఆఖరి టెస్టులో ఆడే అవకాశం ఉన్నా భారత్‌కి వచ్చేందుకు ఇష్టపడలేదు.

కేన్ విలియమ్సన్ (AFP)

భారత్ గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. 36 ఏళ్ల తర్వాత ఎట్టకేలకి భారత్‌లో టెస్టు గెలుపు రుచి చూసిన న్యూజిలాండ్ టీమ్.. వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో గెలిచి 3 టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన ఆఖరి టెస్టు మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నవంబరు 1 (శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది.

కేన్ లేకపోయినా.. తగ్గని కివీస్

వాస్తవానికి న్యూజిలాండ్ జట్టు ఈ తరహాలో భారత్ జట్టుని వరుసగా రెండు టెస్టుల్లో ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. భారత్ పిచ్‌లపై అపార అనుభవం ఉన్న ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా తొలి టెస్టుకి దూరంగా ఉండటంతో భారత్‌కి కనీస పోటీనైనా ఇస్తుందా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ.. అందరూ ఆశ్చర్యపోయేలా బెంగళూరు, పుణె టెస్టులో కివీస్ అదరగొట్టేసింది.

గజ్జల్లో గాయం కారణంగా తొలి రెండు టెస్టులకి దూరంగా ఉన్న కేన్ విలియమ్సన్.. మూడో టెస్టుకి కూడా అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ తాజాగా ప్రకటించింది. భారత్ గడ్డపై దాదాపు ఆరు దశాబ్దాలుగా పర్యటిస్తున్న న్యూజిలాండ్ టీమ్ తొలిసారి టెస్టు సిరీస్‌ని ఇక్కడ గెలిచింది.

అరుదైన క్షణం

ఒకవేళ వాంఖడే టెస్టులో భారత్ గెలిచినా ఇప్పటికే కివీస్ 2-0తో లీడ్‌లో ఉంది కాబట్టి ఆ టీమ్‌దే సిరీస్ అవుతుంది. అయితే అరుదైన ఆ చారిత్రక క్షణాన్ని టెస్టు సిరీస్ ట్రోఫీతో ఆస్వాదించే అవకాశం కేన్ విలియమ్సన్‌కి చేజారింది.

ఇంగ్లాండ్‌తో నవంబరు 28 నుంచి న్యూజిలాండ్ టీమ్ టెస్టు సిరీస్‌ను ఆడనుంది. దాంతో ఈ సిరీస్ టైమ్‌కి ఫిట్‌నెస్‌ని మరింత మెరుగుపర్చుకోవాలని కేన్ విలియమ్సన్ ప్రయత్నిస్తున్నట్లు న్యూజిలాండ్ టీమ్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే భారత్ గడ్డపై టెస్టు సిరీస్ దక్కిన నేపథ్యంలో.. నామమాత్రమైన ఆఖరి టెస్టు కోసం రావడానికి కేన్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దాంతో అతనికి మరో నెల పాటు రెస్ట్ ఇస్తే.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి ఫ్రెష్‌గా అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ భావిస్తున్నాడు.

కేన్ మామగా.. అందరికీ సుపరిచితమే

ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న కేన్ విలియమ్సన్‌కి భారత్ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. అలానే భారత్ జట్టుపై అన్ని ఫార్మాట్లలోనూ అతనికి మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. కేన్‌ని భారత్ అభిమానులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు కేన్ మామ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు.

ఒకవేళ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండి ఉంటే న్యూజిలాండ్ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతంగా ఉండేది. అలానే కొత్త కెప్టెన్ టామ్ లాథమ్‌కి సహాయంగా ఉండేది. అయితే.. కేన్ లేకపోయినా.. న్యూజిలాండ్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్‌పై సిరీస్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది.