WTC Final Qualification: పుణె టెస్టులో ఓడి పీకలమీదకి తెచ్చుకున్న టీమిండియా, ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే ఒకటే దారి!-how india can still qualify for world test championship final despite crushing home series loss to new zealand ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wtc Final Qualification: పుణె టెస్టులో ఓడి పీకలమీదకి తెచ్చుకున్న టీమిండియా, ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే ఒకటే దారి!

WTC Final Qualification: పుణె టెస్టులో ఓడి పీకలమీదకి తెచ్చుకున్న టీమిండియా, ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే ఒకటే దారి!

Galeti Rajendra HT Telugu

WTC Points Table: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా.. వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయింది. దాంతో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ ( Surjeet Yadav)

న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో పుణె టెస్టులో ఓడిన భారత్ జట్టు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చుకుంది. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా.. మూడు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకుంది. ఇక మిగిలిన ఆఖరి టెస్టు మ్యాచ్ నవంబరు 1 నుంచి ముంబయిలోని వాంఖడే వేదికగా జరగనుంది.

టాప్‌లో ఉన్నా.. భారత్‌కి తప్పని టెన్షన్

వాస్తవానికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ జట్టు గత కొంతకాలంగా టాప్‌లో కొనసాగుతోంది. కానీ.. న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో పాయింట్ల శాతంపై భారీగా కోత పడింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు 70.0% పాయింట్లతో ఉన్న భారత్ జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో 62.82%కి పడిపోయింది. ఫలితంగా రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకి నెం.1 స్థానాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50% పాయింట్లతో ఉండగా.. భారత్ కేవలం 0.32 పాయింట్లు ముందంజలో ఉంది. ఒకవేళ పొరపాటున వాంఖడే టెస్టులోనూ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో టీమిండియా నెం.1 స్థానం గల్లంతు అవుతుంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం కంగారూల గడ్డపైకి భారత్ టెస్టు జట్టు వెళ్లనుంది.

భారత్ ఓటమితో.. 3 జట్లు రేసులోకి

వాస్తవానికి న్యూజిలాండ్‌తో ఈ మూడు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు గెలిచి ఉంటే.. నెం.1 స్థానం మరింత పదిలం అవడంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు కూడా దాదాపు ఖాయమైపోయేది. కానీ.. వరుసగా రెండు ఓటములతో భారత్‌‌కి ఇప్పుడు ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి. భారత్ జట్టు వరుస ఓటములతో ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి ఆస్ట్రేలియాతో పాటు శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా వచ్చి చేరాయి.

భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఇక ఆరు టెస్టులను ఆడనుంది. ఇందులో న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియాతో ఐదు ఉన్నాయి. మిగిలిన జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ జట్టు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించాలంటే.. ఈ ఆరు టెస్టుల్లో కనీసం 4 మ్యాచ్‌ల్లో గెలవాలి.

అన్ని జట్లకీ అంత ఈజీ కాదు

భారత్‌తో పాటు ఫైనల్‌ రేసులో ఉన్న ఆస్ట్రేలియాకి కూడా అంత సులువుగా లేదు. ఆ జట్టు భారత్‌తో 5 టెస్టుల, శ్రీలంకతో 2 టెస్టులు ఆడనుండగా.. ఈ ఏడింటిలో కనీసం 4 గెలిస్తేనే ఫైనల్‌కి వెళ్తుంది. మిగిలిన శ్రీలంక జట్టు 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధిస్తే ఫైనల్ రేసులో నిలుస్తుంది. న్యూజిలాండ్ చివరిగా ఆడే నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంది. దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌లకిగానూ 4 మ్యాచ్‌ల్లో గెలవాలి. ఇలా గెలిస్తేనే ఆ జట్లు ఫైనల్‌ రేసులో నిలుస్తాయి.

భారత్ గడ్డపై గత 12 ఏళ్లుగా వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. అనూహ్యరీతిలో న్యూజిలాండ్‌ చేతిలో సిరీస్‌ని చేజార్చుకుంది. ఆ జట్టు 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలుపు రుచిని చూస్తోంది. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ పేస్‌కి, పుణె టెస్టులో ఆ జట్టు స్పిన్‌కి టీమిండియా బలైపోయింది.