Virat Kohli: కోహ్లీని విమర్శించినందుకు చంపేస్తామని బెదిరించారు: స్టార్ కామెంటేటర్
29 May 2024, 23:35 IST
- Virat Kohli - IPL 2024: విరాట్ కోహ్లీని ఓ విషయంలో విమర్శించిన తర్వాత తనకు హత్య బెదిరింపులు వచ్చాయని కామెంటేటర్ సైమన్ డౌల్ చెప్పారు. తాను చాలా విషయాల్లో కోహ్లీని ప్రశంసించినా.. ఒక్క అంశంలో విమర్శిస్తే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.
కోహ్లీని విమర్శించినందుకు చంపేస్తామని బెదిరించారు: స్టార్ కామెంటేటర్
Simon Doull - Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, సీజన్ ఆరంభంలో కోహ్లీ ఎక్కువ దూకుడుగా ఆడలేదు. దీంతో విరాట్ స్ట్రైక్ రేట్ విషయంపై చర్చ సాగింది. కొందరు కామెంటేటర్లు ఈ విషయంపై కోహ్లీని విమర్శించారు. అయితే, ఆ తర్వాత కోహ్లీ దూకుడుగా ఆడి ఏకంగా ఈ సీజన్‍లో స్ట్రైక్ రేట్‍ను 154.70కు పెంచి విమర్శలకు సమాధానాలు ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ తక్కువ స్ట్రైక్ రేట్‍తో ఆడుతున్నాడని, ఔట్ అవుతాననే భయంతో దూకుడు చూపడం లేదని ఐపీఎల్‍లో కామెంటేటర్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఓ దశలో అన్నాడు. అయితే, కోహ్లీ ఆ తర్వాత దూకుడుగా ఆడడంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కూడా ఆ తర్వాత సైమన్ వెల్లడించాడు. ఈ సీజన్‍లో కోహ్లీనే బెస్ట్ అని అన్నాడు. అయితే, కోహ్లీని విమర్శించిన సమయంలో తనను చంపేస్తానంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా బెదిరించారని క్రిక్‍బజ్ కార్యక్రమంలో సైమన్ డౌల్ వెల్లడించాడు.
గొప్పగా చాలా విషయాలు చెప్పినా..
విరాట్ కోహ్లీ గురించి తాను గొప్పగా వెయ్యి విషయాలు చెప్పినా.. ఒక్క విమర్శ చేస్తే తనకు చావు బెదిరింపులు వచ్చాయని సైమన్ డౌల్ చెప్పాడు. ఔట్ అవడం గురించి కోహ్లీ ఆలోచించకుండా దూకుడుగా ఆడాలనే తాను చెప్పానని ఆయన అన్నాడు. విరాట్ గురించి తాను నెగెటివ్‍గా మాట్లాడడం చాలా అరుదు అని తెలిపాడు.
“నేను విరాట్ కోహ్లీ గురించి వెయ్యి గొప్ప విషయాలు చెప్పా. కానీ ఒకే అంశంలో ప్రతికూలంగా చెప్పా. ఆ తర్వాతి నుంచి నాకు హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఇది సిగ్గు చేటు” అని సైమన్ డౌల్ చెప్పాడు.
విరాట్ కోహ్లీతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని సైమన్ డౌల్ స్పష్టం చేశాడు. మ్యాచ్‍లు ముగిసిన తర్వాత చాలాసార్లు తాను, విరాట్ మాట్లాడుకున్నామని తెలిపాడు. తమ మధ్య ఎలాంటి సమస్య లేదని అన్నాడు.
దుమ్మురేపిన కోహ్లీ
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‍ల్లో ఏకంగా 741 పరుగులు చేశాడు. 61.75 యావరేజ్, 154.70 స్ట్రైక్ రేట్‍తో దుమ్మురేపాడు. ఆరెంజ్ క్యాప్‍ను కైవసం చేసుకున్నాడు. ఏకంగా ఈ సీజన్లో 38 సిక్స్‌లు బాదేశాడు. ఈ సీజన్‍లో ఆర్సీబీ అద్భుతంగా కోలుకొని ప్లేఆఫ్స్ చేరడంలో విరాట్ కోహ్లీదే ప్రధాన పాత్ర. ఆరంభంలో కొన్ని మ్యాచ్‍ల్లో జట్టు అవసరాలకు అనుగుణంగా తక్కువ స్ట్రైక్ రేట్‍తో ఆడినా ఆ తర్వాత చెలరేగాడు.
ఈ సీజన్‍లో ఓ దశలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీ స్ట్రైక్‍రేట్‍పై విమర్శలు చేశారు. అయితే, కోహ్లీ కూడా పరోక్షంగా వాటికి స్పందించాడు. ఆ తర్వాత దూకుడు పెంచి ఆడాడు. దీంతో స్ట్రైక్ రేట్‍ను పెంచుకున్నాడు. విమర్శలకు బ్యాటింగ్‍తో పర్‌ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జస్‍ప్రీత్ బుమ్రా సహా కొందరు ఆటగాళ్లు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, విరాట్ కోహ్లీ ఇంకా బయలుదేరలేదు. త్వరలో అతడు వెళతాడని తెలుస్తోంది. న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్‍తో జూన్ 1న వామప్ మ్యాచ్ ఆడనుంది భారత్. టీ20 ప్రపంచకప్‍లో తన తొలి మ్యాచ్‍ను జూన్ 5న ఐర్లాండ్‍తో ఆడనుంది టీమిండియా.