Gavaskar on Natarajan: ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్-sunil gavaskar says sunrisers hyderabad bowler natarajan could have been there in the t20 world cup 2024 squad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Natarajan: ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్

Gavaskar on Natarajan: ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్

Hari Prasad S HT Telugu
May 01, 2024 01:41 PM IST

Gavaskar on Natarajan: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక చేసిన జట్టులో సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ను తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్
ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్ (AFP)

Gavaskar on Natarajan: వచ్చే నెల ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా సెలెక్టర్లు జట్టను ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనిపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్ ను తీసుకోవడం, మరికొందరిని పక్కన పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.

నటరాజన్ ఉండాల్సింది: గవాస్కర్

టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టును చూస్తే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ప్లేయర్స్ ఫామ్ ను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ లెక్కన సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ నటరాజన్ కూడా ఈ సీజన్లో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతడు 7 మ్యాచ్ లలోనే 13 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు డెత్ బౌలర్లలో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు.

తక్కువ ఎకానమీ రేటు, ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేసే సామర్థ్యం అతని సొంతం. పైగా లెఫ్టామ్ బౌలర్. దీంతో అతనికి చోటు కల్పించి ఉంటే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "లెఫ్టామ్ పేస్ బౌలర్ టీ నటరాజన్ ఉంటే బాగుండేది. అతడు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడు జట్టులో ఉంటే బాగుండేదని నేను భావించాను. అయినా సరే. వాళ్లు ఎంపిక చేసిన సీమ్ బౌలర్లు అనుభవజ్ఞులు. అందులో ఎలాంటి సమస్య లేదు" అని గవాస్కర్ అన్నాడు.

నిజానికి నటరాజన్ ను ఎంపిక చేస్తారని చాలా మంది భావించారు. అతనితోపాటు మరో సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మకు కూడా అవకాశం లభిస్తుందని భావించినా.. అదీ జరగలేదు. జట్టులోకి మరో లెఫ్టామ్ పేస్ బౌలర్ అయిన అర్ష్‌దీప్ సింగ్ ను తీసుకున్నరు. అతనితోపాటు బుమ్రా, సిరాజ్ పేస్ బౌలర్లుగా ఉన్నారు. ఇక నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపైనా గవాస్కర్ స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో జడేజా, అక్షర్, చహల్, కుల్దీప్ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.

"జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అతడు నాలుగో పేస్ బౌలర్ గా పనికొస్తాడు. అందుకే వాళ్లు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసి ఉంటారు. వెస్టిండీస్ లోని పిచ్ లపై స్పిన్నర్లకు కాస్త అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఐపీఎల్లో చూస్తూనే ఉన్నాం.. ఎంత నెమ్మదిగా బౌలింగ్ చేస్తుంటే అంతగా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అందుకే నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసి ఉంటారు" అని గవాస్కర్ అన్నాడు.

ఈ నలుగురు స్పిన్నర్లలో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉన్నారు. కుల్దీప్ కూడా అప్పుడప్పుడూ బ్యాట్ తో రాణించగలడు. ఓవరాల్ గా చూస్తే టీమ్ బ్యాలెన్స్ బాగుందనే చెప్పాలి.

టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా ఇదే

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Whats_app_banner