Sanju Samson: చెమటతో కుట్టిన చొక్కా.. మనసులను కదిలిస్తున్న సంజూ శాంసన్ పోస్ట్.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటుపై ఎమోషనల్
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన తర్వాత టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. చెమటతో కుట్టిన చొక్కా అంటూ అతడు ఎమోషనల్ అయ్యాడు.
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీమ్ ను మంగళవారం (ఏప్రిల్ 30) ఎంపిక చేసిన విషయం తెలుసు కదా. ఊహించినట్లే ఈ జట్టులో సంజూ శాంసన్ కు చోటు దక్కింది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా అతడు నిలకడగా రాణిస్తున్న తీరు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అయితే తనను ఎంపిక చేసిన తర్వాత సంజూ చేసిన పోస్ట్ వైరల్ అయింది.
చెమటతో కుట్టిన చొక్కా
టీ20 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసిన తర్వాత మంగళవారం రాత్రి సంజూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. స్టోరీస్ లోనూ అదే పోస్ట్ రిపీట్ చేశాడు. "వియార్పు తునియిట్ట కుప్పయం" అంటూ తన మాతృభాష మలయాళంలో అతడు ఈ పోస్ట్ చేయడం విశేషం. దీనికి అర్థం చెమటతో కుట్టిన చొక్కా అని. తాను టీమిండియా జెర్సీలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ పెట్టాడు.
ఐపీఎల్లో, డొమెస్టిక్ క్రికెట్ లో రాణిస్తున్నా.. సంజూకి ఎక్కువ అవకాశాలు రాకపోవడంపై అతని అభిమానులు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉన్నారు. అయినా సంజూ మాత్రం తన హార్డ్ వర్క్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేయడం ద్వారా సెలక్టర్లు కూడా అతని హార్డ్ వర్క్ ను గుర్తించినట్లయింది.
సంజూకి కలిసొచ్చిన ఐపీఎల్ 2024
ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్ సంజూ శాంసన్ కు బాగా కలిసొస్తోంది. సరిగ్గా టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతుండటం, అదే సమయంలో జట్టు ఎంపిక కోసం సెలక్టర్ల ప్రయత్నాల నేపథ్యంలో సరైన సమయంలో సంజూ రాణిస్తున్నాడు. కెప్టెన్ గా రాజస్థాన్ రాయల్స్ ను ముందుండి నడిపిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో రాయల్స్ 9 మ్యాచ్ లలో 8 విజయాలతో టాప్ లో కొనసాగుతోంది.
ఈ సీజన్లో 9 మ్యాచ్ లలో అతడు 385 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 161గా ఉంది. ఇదే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడో 2015లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడినా.. ఇప్పటి వరకూ సంజూకి పెద్దగా అవకాశాలు దక్కలేదు. ధోనీ, పంత్ లాంటి వాళ్ల నీడలోనే సంజూ ఉండిపోయాడు. 9 ఏళ్లలో కేవలం 25 టీ20ల్లో 374 రన్స్ మాత్రమే చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. అదే ఐపీఎల్లో మాత్రం అతడు నిలకడగా రాణిస్తున్నాడు.
161 మ్యాచ్ లలో 4273 రన్స్ చేయడం విశేషం. సగటు 30.96 కాగా.. స్ట్రైక్ రేట్ 139.04గా ఉంది. మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఐపీఎల్ ఫామ్ ను అతడు టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగిస్తే తర్వాత టీమిండియాలో రెగ్యులర్ గా చోటు దక్కించుకోవడమే కాదు.. కెప్టెన్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వికెట్ కీపర్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిలకడగా రాణించే వారికే జట్టులో చోటు దక్కుతుంది అనడంలో సందేహం లేదు.
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.